వైఎస్ జగన్ కు మరో లేఖాస్త్రం సంధించిన రఘురామ కృష్ణంరాజు

By telugu teamFirst Published Aug 23, 2020, 1:48 PM IST
Highlights

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఏపీ సీఎం వైఎస్ జగన్ కు మరో లేఖాస్త్రం సందించారు. పాఠశాలలను తెరవాలనే నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయన జగన్ ను కోరారు.

ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించారు. వైసీపీ తరఫున లోకసభకు ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికప్పుడు తప్పు పడుతూ వస్తున్నారు. 

రాష్ట్రంలో పాఠశాలలు తెరవాలనే జగన్ ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ తాజాగా లేఖ రాశారు. రాష్ట్రంలో పాఠశాలల ప్రారంభాన్ని వాయిదా వేయాలని ఆయన జగన్ ను కోరారు. కరోనా వైరస్ రాష్ట్రంలో ఇంకా తగ్గుముఖం పట్టలేదని, ఈ సమయంలో పాఠశాలలు తెరిస్తే పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. 

పాఠశాలలు తెరిస్తే పిల్లలకు ప్రాణహాని ఉంటుందనే భయాందోళనలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయని ఆయన అన్నారు. రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదవుతున్న స్థితిలో పాఠశాలలు తెరవాలని నిర్ణయించడం సరైంది కాదని ఆయన అన్నారు. 

చిన్న పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. పిల్లలు కరోనా బారిన పడినా, మృత్యువాత పడినా ప్రభుత్వానికి చెడు పేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మన ప్రభుత్వం పాఠశాలలను బాగు చేయాలని నాడు -నేడు, అమ్మ ఒడి, జగన్ గోరుముద్ద వంటి పలు మంచి పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన ప్రశంసించారు. 

పాఠశాలలు ప్రారంభించే విషయంపై అందరి సలహాలు, సూచనలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన జగన్ ను కోరారు. రాష్ట్రంలో పిల్లల తల్లిదండ్రుల మనోభావాలను, పిల్ల ఆరోగ్యం పట్ల వారి ఆందోళనను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

click me!