ఆర్మీ ఆస్పత్రిలోనే రఘురామ కృష్ణం రాజు: విడుదలకు మరో నాలుగు రోజులు

By telugu teamFirst Published May 24, 2021, 12:50 PM IST
Highlights

సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలోనే ప్రస్తుతం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఉన్నారు. ఆయన విడుదలకు నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. గాయాలకు మరో నాలుగు రోజుల చికిత్స అవసరమని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వర్గాలు చెప్పాయి.

అమరావతి: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇంకా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజురు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఆయన ఆర్మీ ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన విడుదలకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది.

సిఐడి కోర్టుకు రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులను అందించారు. అయితే, తమకు రఘురామ కృష్ణం రాజు డిశ్చార్జీ సమ్మరీ కావాలని కోర్టు అడిగింది. అయితే, రఘురామ కృష్ణం రాజుకు వైద్యం జరుగుతోందని, డిశ్చార్జీ చేయడానికి సమయం పడుతుందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. దీంతో ఆయన విడుదలకు సమయం పడుతోంది. 

రఘురామ కృష్ణం రాజు గాయాల నుంచి కోలువడానికి మరో నాలుగు రోజులు పడుతుందని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. రఘురామ కృష్ణం రాజుకు తగిలిన గాయాలపై వైద్య పరీక్షలు చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుంటూరు జైలు నుంచి ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. 

రఘురామ కృష్ణం రాజు కాలి పాదాలకు గాయాలున్నాయని ఆర్మీ ఆస్పత్రి తన నివేదికలో తెలిపింది. తన నివేదికను సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు పంపించింది. సీల్డ్ కవర్ లో పంపిన నివేదకను సుప్రీంకోర్టు చదివి వినిపించింది. అయితే, ఆ గాయాలు ఎలా అయ్యాయనే విషయంపై ఆస్పత్రి స్పష్టత ఇవ్వలేదు.

ఈ స్థితిలో రఘురామ కృష్ణం రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, రఘురామ కృష్ణం రాజు ఆర్మీ ఆస్పత్రి నుంచి నేరుగా ఇంటికి వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఆయనను గుంటూరు జైలుకు తరలించి, ఇక్కడి నుంచి విడుదల చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద రఘురామ కృష్ణమ రాజు విడుదలకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

click me!