ఎస్సీ-ఎస్టీ కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఊరట లభించింది. ఈ కేసులో ఎస్సీ-ఎస్టీ ఎలా పెడతారంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. అరెస్ట్ తో పాటు అన్ని చర్యలనూ నిలిపివేసింది.
అమరావతి : వైసీపీ ఎంపీ Raghurama Krishnarajuకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఐపీసీసెక్షన్లు, SC-ST Act కింద కేసు నమోదు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. ఐపీసీ సెక్షన్ 500 (పరువు నష్టం) నమోదు చేయడాన్ని Court ఆక్షేపించింది. పిటిషనర్ వ్యాఖ్యలకు ఎస్సీ-ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుంది అని నిలదీసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్టుతో పాటు తదుపరి చర్యలన్నీటినీ నిలుపుదల చేసింది.
ప్రతివాదులుగా ఉన్న State Government, Gondirajuలకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఓ TV debate లో రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారంటూ చింతలపూడి మండలం మల్లయ్యగూడెంకు చెందిన గొందిరాజు ఫిర్యాదు చేశారు.
undefined
దాని ఆధారంగా పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153a, 500లతో పాటు ఎస్సీ -ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, దానిని రద్దు చేయాలని కోరుతూ రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.శ్రీవెంకటేష్ వాదనలు వినిపించారు.
కాగా, జనవరి 17న ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులకు వైసీపీ రెబెల్ ఎంపీ Raghurama krishnam Raju లేఖ రాశారు. ఆ రోజు విచారణకు తాను హాజరు కాలేనని ఆ లేఖలో తెలిపారు. Delhi వెళ్లిన తర్వాత తాను అనారోగ్యానికి గురయ్యానని, అందుకే విచారణకు హాజరు కాలేనని ఆ లేఖలో రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
తాను విచారణకు హాజరయ్యేందుకు కనీసం నాలుగు వారాల సమయం ఇవ్వాలని ఆ లేఖలో సీఐడీ పోలీసులను రఘురామకృష్ణంరాజు కోరారు. జనవరి 12 వ తేదీన జనవరి 17న విచారణకు హాజరు కావాలని ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజుకు నోటీసు ఇచ్చారు. ఈ నోటీసులు తీసుకొన్న రఘురామకృష్ణంరాజు విచారణకు హాజరౌతానని చెప్పారు. కానీ అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేని ఆయన ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా మీడియాలో వ్యాఖ్యలు చేశారని ఏపీ సీఐడీ అధికారులు 2021 మే 14న రఘురామకృష్ణంరాజును హైరదాబాద్ లోని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యవహరించారని 124-ఏ , Ipc 153 - బీసెక్షన్ కింద సీఐడీ కేసు నమోదుచేసింది. దీంతో పాటుగా ఐపీసీ సెక్షన్ 505 కింద బెదిరింపులకు పాల్పడటం, ఐపీసీ సెక్షన్ 120-B కింద దురుద్దేశపూర్వకంగా కుట్రకు పాల్పడ్డారనే అభియోగాల కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను సీఐడీ అరెస్ట్ చేసింది.
తనపై నమోదైన కేసుల విషయమై పలు కోర్టుల్లో రఘురామకృష్ణంరాజు పిటిషన్లు దాఖలు చేశారు. చివరకు ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో 2021 మే 21న రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను ఉన్నత న్యాయస్థానం ఇచ్చింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో, లక్ష రూపాయల షూరిటీ బాండ్లతో బెయిల్ తీసుకోవచ్చని తెలిపింది.