ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న పుట్టపర్తి నియోకవర్గం 2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి నెలకొంది.
పుట్టపర్తి.. ఈ పేరు తెలియని భారతీయుడు వుండరంటే అతిశయోక్తి కాదు. కొన్నేళ్ల క్రితం ఓ చిన్న గ్రామంగా వున్న పుట్టపర్తి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీనికి కారణం సత్యసాయి బాబా. చిత్రావతి నది ఒడ్డున వున్న పుట్టపర్తిలో ఆయన 1950లో ప్రశాంతి నిలయం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా పుట్టపర్తికి భక్తుల తాకిడి పెరిగింది. నిత్యం దేశ విదేశాల నుంచి సందర్శకులు ఈ పట్టణానికి వచ్చేవారు. సత్యసాయి నిర్యాణం తర్వాత పుట్టపర్తి వైభవం తగ్గినప్పటికీ .. భక్తుల రాక మాత్రం తగ్గలేదు.
పుట్టపర్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. పల్లె రఘునాథరెడ్డి ఫ్యామిలీకి అడ్డా :
ఇక రాజకీయాల విషయానికి వస్తే.. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పుట్టపర్తి ఏర్పడింది. గతంలో వున్న గోరంట్ల నియోజకవర్గం రద్ధయి.. పుట్టపర్తి పుట్టుకొచ్చింది. నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు, పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాలను కలిపి పుట్టపర్తిగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరిగితే.. రెండు సార్లు టీడీపీయే గెలిచింది.
2009, 2014లలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో హ్యాట్రిక్ సాధించాలనుకున్నా వైసీపీ ఆయన జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డీ సుధీర్ రెడ్డికి 97,234 ఓట్లు .. టీడీపీ అభ్యర్ధి పల్లె రఘునాథ రెడ్డికి 65,979 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 31,255 ఓట్ల తేడాతో విజయం సాదించింది.
పుట్టపర్తి శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ :
2024 ఎన్నికల విషయానికి వస్తే.. పుట్టపర్తిలో టీడీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆయన టికెట్ కేటాయించారు. తెలుగుదేశం పార్టీ తిరిగి ఇక్కడ పాగా వేయాలని భావిస్తోంది. పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఖరారవుతుందని అంతా భావించారు. పుట్టపర్తి అంటే పల్లె, పల్లె అంటే పుట్టపర్తి అన్నట్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఈసారి టికెట్ దక్కలేదు.
వయసు రీత్యా పల్లె రఘునాథరెడ్డికి టికెట్ నిరాకరించినప్పటికీ.. ఆయన కుటుంబానికే ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూర రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు. పల్లె కుటుంబానికి వున్న పేరు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా తాను గెలుస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. పిన్న వయస్కురాలు, ఉన్నత విద్యావంతురాలు కావడంతో సింధూర రెడ్డికి యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ నుంచి దడి మధుసూదన్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న పుట్టపర్తి నియోకవర్గం 2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి నెలకొంది. పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న మండలాలు:
1. నల్లమడ
2. బుక్కపట్నం
3. కొత్త చెరువు
4. పుట్టపర్తి
5. ఓడి చెరువు
6. అమడుగుర్
ఈ మండలాలు కొన్ని టిడిపికి, కొన్ని వైసీపీకి బలం ఉన్నవి ఉన్నాయి. మరి ఓవరాల్ గా ఎవరు జయకేతనం ఎగురవేస్తారో చూడాలి.