వైసిపిలోకి దగ్గుబాటి, హితేష్: పురంధేశ్వరి తీవ్ర ఆవేదన

By pratap reddyFirst Published Jan 29, 2019, 7:30 AM IST
Highlights

దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన నాటి నుంచి నేటి వరకూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతోంది. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 

అమరావతి: తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, కుమారుడు హితేష్ చెంచురామ్ వైఎస్సార్ కాంగ్రెసులో చేరుతున్న వార్తలపై నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలకు బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నలతో వారి విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. 

దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చిన నాటి నుంచి నేటి వరకూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ జరుగుతోంది. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది సున్నితమైన, వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తున్నారని పురంధేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. 

సామాజిక మాధ్యమాల్లో తన కుటుంబంపై జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.  తాను ఇద్దరు బిడ్డలను కోల్పోయిన విషయం వాళ్లకు తెలుసా? కూతురికంటే ముందు ఒకరిని, కుమారుడి కంటే ముందు మరొకరిని కోల్పోయానని ఆమె అన్నారు. 

ప్రత్యేక వైద్యం నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలుసా, తన తండ్రి దివంగత ఎన్టీఆర్ బలవంతంగా అమెరికా పంపిన విషయం తెలుసా అని ఆమె ప్రశ్నించారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న ఈ ఎపిసోడ్‌లో తాను చెప్పాల్సింది ఏమీ లేదని ఆమె అన్నారు. మళ్లీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును టీడీపీ తిరస్కరించిన విషయం ఎవరికైనా తెలుసా అని అడిగారు. 

2014లో తనకు బీజేపీ టిక్కెట్ దక్కకుండా టీడీపీ కుట్ర చేసిన విషయం ఎవరికైనా తెలుసా అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా తన కుటుంబాన్ని ప్రేమిస్తానని, ఏ వ్యక్తిపై కూడా వ్యక్తిగతంగా విమర్శించిన సందర్భాలు లేవని ఆమె అన్నారు. "దయచేసి నా పిల్లలు, కుటుంబానికి సంబంధించిన సున్నితమైన .. వ్యక్తిగత అంశాల జోలికెళ్లకండి" ఆమె నెటిజన్లను కోరారు.

click me!