రఘురామ కృష్ణమ రాజు సీటుపై కన్నేసిన కమెడియన్ పృథ్వీ

By telugu teamFirst Published Jul 23, 2020, 4:55 PM IST
Highlights

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు నర్సాపురం సీటుపై ఎస్వీబీసీ మాజీ చైర్మన్, టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ అప్పుడే కన్నేశారు. ఉప ఎన్నిక వస్తే ఆ సీటు నుంచి తానే పోటీ చేస్తానని అంటున్నారు.

అమరావతి: తీవ్రమైన ఆరోపణల కారణంగా ఎస్వీబీీస చైర్మన్ పదవిని పోగొట్టుకున్న టాలీవుడ్ కమెడియన్ పృథ్వీ నరసాపురం లోకసభ సీటు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రఘురామకృష్ణమ రాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) ఎంపీలు లోకసభ స్పీకర్ ఓంబిర్లాను కోరారు. ఈ మేరకు వారు స్పీకర్ ను పిటిషన్ పెట్టుకున్నారు. 

రామకృష్ణమ రాజు వ్యవహారం అలా నలుగుతుండగానే నర్సాపురం సీటుకు ఉప ఎన్నికలు వస్తాయని పృథ్వీ భావిస్తున్నట్లుగా ఉన్నారు. నర్సాపారుం సీటుకు ఉప ఎన్నికలు జరిగితే ఆ సీటు తనదేనని ఆయన అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమ రాజు విజయం కోసం అహోరాత్రులు పనిచేశామని, దానివల్లనే ఆయన ఇప్పుడు ఎంపిగా ఉన్నారని పృథ్వీ అన్నారు. 

ఇప్పుడు రఘురామకృష్ణమ రాజు పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారని, ఇష్టం వచ్చినట్లుగా అందరి గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నర్సాపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే తప్పకుండా తాను పోటీ చేస్తానని, పోటీ చేసి గెలుస్తానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను అడిగి టికెట్ తెచ్చుకుంటానని ఆయన చెప్పారు. 

అయితే, రఘురామకృష్ణమ రాజు వ్యవహారం ఇప్పట్లో తేలుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై రఘురామకృష్ణమ రాజు లా పాయింట్ లాగి సమాధానం కూడా ఇవ్వలేదు. వైసీపీలో కొనసాగుతూనే ఆయన వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

రఘురామకృష్ణ రాజుకు చెక్ పెట్టాలని వైసీపీ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. వ్యవహారం సవాళ్లు, ప్రతిసవాళ్ల స్థాయి దాటి కోర్టుల దాకా వెళ్లింది. రఘురామకృష్ణమ రాజు వ్యవహారం ఎప్పుడు తేలుతుందో తెలియదు గానీ పృథ్వీ అప్పుడే ఆ సీటుపై కన్నేశారు.

click me!