ఎస్పీ వాహనంపై యువకుల రాళ్ల దాడి.. ఎమ్మెల్యేను అడ్డుకున్న నిరసనకారులు, రావులపాలెంలో టెన్షన్

By Siva KodatiFirst Published May 25, 2022, 6:31 PM IST
Highlights

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగాయి. ఈ నేపథ్యంలో రావులపాలెంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వాహనంపై నిరసనకారులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన వాహనం పూర్తిగా దెబ్బతింది. 

రావులపాలెంలో (ravulapalem) టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నటితో సద్దుమణిగింది అనుకున్న వాతావరణం ఇప్పుడు రావులపాలెంలో కనిపిస్తోంది. ఎస్పీ ఐశ్వర్య రస్తోగి (aishwarya rastogi) వాహనంపై కొందరు గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. దీంతో వారిని పోలీసులు వెంబడించారు. ఈ ఘటనలో ఆయన వాహనం పూర్తిగా దెబ్బతింది. మరోవైపు ఎమ్మెల్యే జగ్గిరెడ్డిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. 

కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ కోనసీమ సాధన సమితి నేడు చలో రావులపాలెంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిన్న అమలాపురంలో చోటుచేసుకన్న హింసాత్మక ఘటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అమలాపురంలో మాదిరి పరిస్థితి చేయిదాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించారు. రోడ్లపైకి ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్లు, కార్యాలయ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆధ్వర్యంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

ఇక, సాధన సమితి పిలుపు మేరకు రావులపాలెంలో కొందరు యువకులు రోడ్లపైకి వచ్చారు. ఈ క్రమంలోనే అనుమానస్పదంగా తిరుగుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌లు, ఆటోల్లో వస్తున్న యువకులపై పోలీసులు నిఘా ఉంచారు. యువకులు బైక్ ర్యాలీగా బయలుదేరుతారనే అనుమానంతో.. పోలీసులు వాహనాల తనీఖీలు చేపట్టారు. రావులపాలెంతో పాటు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. 

ALso Read:అన్యం సాయి జనసేన మనిషే.. సాక్ష్యాధారాలివే, కఠిన చర్యలు తప్పవు : సజ్జల రామకృష్ణారెడ్డి

మరోవైపు.. కోనసీమలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ (ap dgp) కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (kasireddy rajendranath reddy) సమీక్ష చేపట్టారు. ఏలూరు రేంజ్ డీఐజీ, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్న అమలాపురంలో చోటుచేసుకున్న విధ్వంసం, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితుల గురించి డీజీపీ ఆరా తీశారు. ఆ తర్వాత ఓ తెలుగు న్యూస్ చాన‌ల్‌తో డీజీపీ మాట్లాడుతూ.. కొనసీమకు అదనపు బలగాలను తరలించడం జరిగిందన్నారు. 2000 మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చెప్పారు. గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 7 కేసులు నమోదు చేసినట్టుగా తెలిపారు. 

ప్రస్తుతం కొనసీమలో (konaseema district) పరిస్థితి అదుపులోనే ఉందని డీజీపీ చెప్పారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. నిన్న హింసాత్మక ఘటనలకు పాల్పడిన 72 మందిని గుర్తించామని చెప్పారు. ఇప్పటివరకు 46 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నగరంలోని రౌడీ షీటర్లను కూడా అదుపులోకి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. పోలీసులు సంయమనం పాటించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారని తెలిపారు. 

click me!