అన్యం సాయి జనసేన మనిషే.. సాక్ష్యాధారాలివే, కఠిన చర్యలు తప్పవు : సజ్జల రామకృష్ణారెడ్డి

By Siva KodatiFirst Published May 25, 2022, 5:49 PM IST
Highlights

అమలాపురం అల్లర్లకు సంబంధించి టీడీపీ, జనసేన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలు వుంటాయని ఆయన హెచ్చరించారు. అన్యం సాయి జనసేన పార్టీకి చెందిన వ్యక్తేనని సజ్జల తెలిపారు. 
 

అన్యం సాయి జనసేనకు (janasena) చెందిన  వ్యక్తేనని సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ఆరోపించారు. జనసేన కార్యక్రమాల్లో అన్యం సాయి పాల్గొన్న ఫోటోలు బయటికి వచ్చాయని ఆయన తెలిపారు. అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలు వుంటాయని సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. టీడీపీ (tdp) ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను చదివారేమో అంటూ ఆయన దుయ్యబట్టారు. 

కోనసీమ విధ్వంసంపై పార్టీల స్పందన చూస్తుంటే వాళ్లే కథంతా నడిపించారేమోన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దాడులకు కారణం వైసీపీయేనని చంద్రబాబు (chandrababu naidu) , పవన్ కల్యాణ్ (pawan kalyan) ఆరోపిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ, జనసేనవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని సజ్జల ఫైరయ్యారు. మంత్రి, ఎమ్మెల్యే సహా వారి కుటుంబ సభ్యులు వున్న ఇళ్లపై మేమే దాడులు చేయించుకుంటామా అని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కోరస్‌లా అంతా ఒకటే చెబుతున్నారని ఆయన ఫైరయ్యారు. 

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని జనసేన నేతలు దీక్షలు చేశారని.. చంద్రబాబు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారని సజ్జల గుర్తుచేశారు. నిన్నటి ఘటన రాజకీయ ప్రవేశమని ఆయన స్పష్టం చేశారు. శ్రీలంకలో జరుగుతున్నట్లు ఇక్కడా జరుగుతోందని చెప్పడానికి ఇదంతా చేశారేమోనంటూ సజ్జల చురకలు వేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలో వద్దో టీడీపీ, జనసేన స్పష్టంగా చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు. 

అడ్డదారుల్లో ప్రయోజనం పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏం చెప్పాలనుకున్నారో పవన్‌కే తెలియడం లేదని.. అల్లర్ల విషయం వదిలేసి ఏవేవో మాట్లాడుతున్నారని చురకలు వేశారు. టీడీపీ హయాంలో అత్యాచార ఘటనపై పవన్‌కు వివరాలు అందిస్తామని సజ్జల తెలిపారు. కులం, మతాలను అడ్డుపెట్టుకొని తాము అధికారంలోకి రాలేదని... సీఎం జగన్‌ కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు రామకృష్ణారెడ్డి అన్నారు. 
 

click me!