
ప్రతిపక్ష వైసీపీ శాసనసభ్యులపై వేటు ఖాయమేనా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రివిలేజ్ కమిటీ సమావేశం తర్వాత వైసీపీ సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడిన తీరు చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి. గత శాసనసభ సమావేశాల్లో సభా కార్యక్రమాలకు పదే పదే ఆటంకాలు సృష్టించారంటూ 16 మంది వైసీపీ సభ్యులను సస్పెండ్ చేసారు. అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన సిఫారసులతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రివిలేజ్ కమిటిని నియమించారు.
అప్పటి నుండి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో కమిటి ఐదుసార్లు సమావేశమైంది. కమిటీ నోటీసులు ఇచ్చినా పలువురు వైసీపీ సభ్యులు విచారణకు హాజరుకాలేదు. పైగా తమ చర్యను సమర్ధించుకుంటూ మాట్లాడారు. ఈ నేపధ్యంలో శనివారం జరిగినదే బహుశా చివరి సమావేశం. దాంతో రామచంద్రారెడ్డి తమ సభ్యులపై కమిటి చర్యలు తసుకోకుండా గట్టిగా వాదించినా ఉపయోగం కనబడలేదని సమాచారం.
అనంతరం రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడిన విధానం చూస్తే వైసీపీ సభ్యులపై వేటుఖాయంగా తోస్తోంది. తమ సభ్యులపై కమిటి తీసుకోబోయే ఎటువంటి చర్యతోనూ తనకు సంబంధం లేదని లేఖ ఇవ్వటం ద్వారా స్పష్టం చేసినట్లు పెద్దిరెడ్డి చెప్పటం గమనార్హం. అదే సమయంలో చంద్రబాబునాయుడు, టిడపి సభ్యులు గతంలో సభలో వ్యవహరించిన విధానాన్ని కూడా గుర్తు చేసానన్నారు. సభ సజావుగా జరగాలంటే అధికార పార్టీపైనే ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు.
గడచిన రెండున్నరేళ్ళ సభా నిర్వహణను గమనిస్తే అధికార, ప్రతిపక్ష సభ్యులిద్దరూ ఒకరిని మరొకరు దూషించుకున్న ఘటనలెన్నో. అయితే, ప్రతీసారి చర్యలు మాత్రం వైసీపీ సభ్యులపైనే ఉంటున్నాయి. ఆర్కె రోజా ఘటనే అందుకు ఉదాహరణ. వైసీపీ సభ్యులను టిడిపి సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారు. దాంతో వైసీపీ సభ్యులు రెచ్చిపోగానే స్పీకర్ చర్యలు తీసుకుంటున్నారు. బోండా ఉమ, బుచ్చయ్యచౌదరి, కింజరాపు అచ్చెన్నాయడు, రావెల కిషోర్ బాబు, దేవినేని ఉమ ఇలా ఎందరో అధికార పార్టీ సభ్యులు హద్దులు మీరిన ఘటనలు చాలానే ఉన్నా చర్యలు మాత్రం ప్రతిపక్ష సభ్యులపైనే ఉండటం గమనార్హం.