నయా మోసం.. గర్భవతి అని చెప్పి తొమ్మిది నెలల పాటు వేలల్లో ఖర్చు.. తీరా ప్రసవానికి వెడితే...

By SumaBala BukkaFirst Published Sep 21, 2022, 7:15 AM IST
Highlights

కాకినాడలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఓ వివాహితను గర్భవతి అని చెప్పి తొమ్మిదినెలల పాటు మందులు, స్కానింగ్ లు అంటూ వేలల్లో ఖర్చు పెట్టించారో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు.. తీరా ప్రసవం సమయానికి వచ్చేసరికి.. 

కాకినాడ : వైద్య పరమైన మోసాల్లో మరో కొత్తరకం వెలుగుచూసింది. ఇలా కూడా మోసం చేయచ్చా అని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. రాని కడుపును వచ్చినట్టుగా చెప్పి.. తొమ్మది నెలలపాటు ఆ దంపతుల, కుటుంబసభ్యుల ఎమోషన్స్ తో ఆడుకున్నారు ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు. తీరా ప్రసవానికని ప్రభుత్వాసుపత్రికి వెడితే ఆమె గర్భవతి కాదన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో షాక్ అయి.. గర్భవతి అని చెప్పిన ఆసుపత్రికి వెళ్లి నిలదీశారు. ఈ ఘటన కాకినాడలో చర్చనీయాంశంగా మారింది. 

మంగళవారంనాడు.. గర్భవతి అని చెప్పి తొమ్మిది నెలల పాటు తిప్పించుకుని.. తీరా ప్రసవం తేదీనికి వెడితే కాదని చెప్పారని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కాకినాడలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి కమలాదేవి విలేకరులకు తెలిపిన కథనం ప్రకారం… తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన వి. సత్యనారాయణతో కొన్నేళ్ళ కిందట  వివాహం అయ్యింది. ఈ ఏడాది జనవరిలో తన భార్యను వైద్య పరీక్షల కోసం కాకినాడ గాంధీ నగర్ లోని రమ్య ఆసుపత్రికి సత్యనారాయణ తీసుకొచ్చాడు. 

చిత్తూరులో పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం... ముగ్గురు సజీవదహనం..

ఆ రోజు పరీక్ష చేసిన వైద్యులు మహాలక్ష్మి గర్భవతి అని రిపోర్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె పరీక్షల కోసం తరచూ ఆసుపత్రికి వచ్చేవారు. వైద్యులు మందులు, స్కానింగ్ రాసి ఇచ్చేవారు. ఆరో నెలలో స్కానింగ్ తీసి సెప్టెంబర్ 22న ప్రసవం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్ళింది. కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు.  అక్కడి వైద్యులు ఆమెకు స్కానింగ్ చేసి మీ అమ్మాయి అసలు గర్భవతే కాదని తెలిపారు. దీంతో షాక్ అయిన కుటుంబసభ్యులు..  హుటాహుటిన మహాలక్ష్మిని కాకినాడ రమ్య ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడి సిబ్బందిని స్కానింగ్ తీయాలని ఒత్తిడి చేశారు. 

దీంతో వైద్య సిబ్బంది స్కానింగ్ కు పంపించారు. స్కానింగ్ తీసే వ్యక్తి మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదని తెలిపాడు. 
ఇదేమిటని వైద్యురాలిని ప్రశ్నించగా.. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పారు. తొమ్మిది నెలల నుంచి తమను ఆసుపత్రికి తిప్పించి.. వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టించారని కమలాదేవి వాపోయారు. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని ప్రతినెల మందులు రాసిచ్చారని.. వాటిని వాడాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. బాధితులకు మహిళా సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. 

click me!