అరకు ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ప్రైవేటు బస్సు...24 మంది ప్రయాణికులు సురక్షితం..

By SumaBala BukkaFirst Published Nov 28, 2022, 6:46 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని అరకులోయలో ఓ ప్రైవేటు బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అయితే ఆ సమయంలో బస్సులో ఉన్న 24 మంది సురక్షితంగా ఉన్నారు. 

అనంతగిరి : అరకులోయ నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్ రోడ్డులో అనంతగిరి సమీపంలో మూడో నెంబరు మలుపు దాటిన తర్వాత ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. విజయనగరం మండలం గొల్లలపేటకు చెందిన  24 మంది పర్యాటకులు ఓ ప్రైవేటు బస్సులో అరకులోయ, బొర్రా గుహలు చూసి తిరుగు ప్రయాణమయ్యారు. టైడా దాటిన తరువాత వీరి బస్సు వెనక చక్రాల మద్య మంటలు చెలరేగి ఒకటైరు వెళ్ళిపోయింది. 

దీంతో ప్రయాణికులు బస్సు నిలిపివేయాలని డ్రైవర్ కు చెప్పారు. అప్పటికే మంటలు తీవ్రం కావడంతో డ్రైవర్ ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. వెంటనే మంటలు బాగా  ఎగిసిపడ్డాయి. దీంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. అయితే, ముందు జాగ్రత్తగా ప్రయాణీకులందరీని ముందే దింపేయడంతో ఎవరికి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఆయనో జ్ఞాన భాండాగారం... ఏ అవార్డ్‌కైనా అర్హులే : చాగంటికి గురజాడ పురస్కారంపై సోము వీర్రాజు స్పందన 

ఇదిలా ఉండగా, అక్టోబర్ 8న మహారాష్ట్రలో ఇలాంటి ప్రమాదమే జరిగింది.మహారాష్ట్రలోని నాసిక్‌లో  జరిగిన బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు మరునాటి ఉదయం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 8 తెల్లవారుజామున నాసిక్-ఔరంగాబాద్ హైవేపై లగ్జరీ ప్యాసింజర్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ సమయంలో బస్సులో ప్రయాణికులు ఉండిపోయారు. దీంతో ఎనిమిదిమంది సజీవదహనం కాగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. 

click me!