గ్యాస్ నింపుతుండగా పేలుడు: ప్రొద్దుటూరులో ప్రైవేట్ అంబులెన్స్ దగ్ధం

By narsimha lodeFirst Published Aug 17, 2021, 11:48 AM IST
Highlights

కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రైవేట్ అంబులెన్స్ కు గ్యాస్ నింపుతున్న సమయంలో ప్రైవేట్ అంబులెన్స్ దగ్ధమైంది.ఈ పేలుడు ధాటికి వాహనం ముక్కలైంది. అంతేకాదు వాహనం దగ్దమైంది. ఫైరింజన్ మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగింది.

కడప: కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రైవేట్ అంబులెన్స్ పేలింది. ఈ పేలుడు ధాటికి అంబులెన్స్ శకలాలు ఎగిరిపడ్డాయి.ఈ అంబులెన్స్ వాహనం ఇంజన్  గ్యాస్ తో నడుస్తోంది.  వాహనానికి ఉన్న గ్యాస్ ట్యాంకర్ లో ఎల్పీజీ గ్యాస్ ను నింపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అది పేలింది. 

దీంతో వాహనం శకలాలు ఎగిరిపడ్డాయి. అంతేకాదు వాహనానికి మంటలు వ్యాపించాయి. ఈ పేలుడు కారణంగా భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెప్పారు. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లను రంగంలోకి దింపారు.

ప్రైవేట్ అంబులెన్స్ లో లిక్విడ్ గ్యాస్ కు బదులుగా ఎల్పీజీ గ్యాస్ నింపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ప్రమాదం జరిగిన సమయంలో అంబులెన్స్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నెహ్రు రోడ్డులోని గీతాంజలి స్కూల్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

నిబంధనలకు విరుద్దంగా  వాహనాల్లో గ్యాస్ నింపుతున్న సమయాల్లో తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. గృహావసరాలకు ఉపయోగించే  సిలిండర్లను కూడ వాహనాలకు ఉపయోగిస్తున్నారు.

గృహావసరాలకు ఉపయోగించే సిలిండర్ల నుండి వాహనాలకు గ్యాస్ ను నింపే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని  చెబుతున్నారు.
 

click me!