పుట్టపర్తిలోని సాయిహరీ గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించారు.
అనంతపురం: పుట్టపర్తిలో సాయిహీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ ను మంగళవారంనాడు వర్చువల్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగించారు. శ్రీసత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. సత్యసాయిబాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మోడీ అభిప్రాయపడ్డారు.పుట్టపర్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతిగా ఆయన పేర్కొన్నారు. కోట్లమందికి సత్యసాయిబాబా ఆదర్శంగా నిలిచారన్నారు. సేవ మార్గాన్ని సత్యసాయిబాబా ప్రపంచానికి చాటి చెప్పారని మోడీ గుర్తు చేశారు.
ఆధునిక డిజిటల్ మౌళిక సదుపాయాలను భారత్ సృష్టిస్తుందని మోడీ తెలిపారు. పుట్టపర్తిలోనూ అన్ని కార్యకలాపాలు డిజిటల్ రూపంలోకి మారాలని మోడీ కోరారు. ప్రేమ అనే రెండు అక్షరాల్లోనే అనంతమైన శక్తి ఇమిడి ఉందని ప్రధాని మోడీ చెప్పారు.ప్రేమించండి... ప్రేమను పంచడంటూ ప్రధాని మోడీ సందేశమిచ్చారు. ప్రపంచానికి ప్రేమ పంచిన మహనీయుడు సత్యసాయిబాబా అని మోడీ గుర్తు చేశారు. సేవాభావనే జీవన విధానంగా మార్చుకున్నారన్నారు. మానవ సేవే మాధవ సేవగా గుర్తించి జీవించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.తన జీవితాన్ని పేదలకు సత్యసాయి అంకితం చేశారన్నారు. సత్యసాయి జీవితం అందరికీ ఆదర్శనీయమని ప్రధాని మోడీ తెలిపారు.
కరుణ, ప్రేమ రసంతో ఎంతో మందిని సత్యసాయి అక్కున చేర్చుకున్నారన్నారు.జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. యోగా దినోత్సవం ప్రపంచాన్ని ఏకం చేసిందన్నారు.