రక్షణ రంగానికి యూనివర్సిటీలు ఉపయోగపడాలి

First Published Dec 7, 2017, 9:20 PM IST
Highlights
  • రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ విశాఖపట్నంకు చేరుకున్నారు.

రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ విశాఖపట్నంకు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిసారి రాష్ట్రపతి విశాఖకు వచ్చారు. గాజువాక విమానాశ్రయంలో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, చంద్రబాబునాయుడు కోవింద్ కు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆర్కె బీచ్ రోడ్డులో కురుసుర ఎదురుగా ఏర్పాటు చేసిన టీయూ-142 యుద్ద విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. తర్వాత బీచ్ రోడ్డులోని పార్క్ హోటల జంక్షన్లో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేశారు. తర్వాత అక్కడి నుండి బయలుదేరి ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్లో పాల్గొన్నారు.

అంతకుముందు ఏయూలో ఈ-క్లాస్‌ రూమ్‌ భవననిర్మాణానికి, ఇన్‌క్యూబేటర్‌ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. తర్వాత డిఫెన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏయూలోని సెంటర్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ పరిశోధనలకు కేంద్రం కానుందన్నారు. రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, పరికరాల తయారీకి ఈ కేంద్రం దోహద పడుతుందని పేర్కొన్నారు. రక్షణ రంగానికి విశ్వవిద్యాలయ పరిశోధనలు తోడ్పడాలని ఆకాంక్షించారు. సామాన్యుల సమస్యలకు విశ్వవిద్యాలయాలు పరిష్కారం చూపాలని ఆకాంక్షించారు. ఏయూలో చదువుకునే వారిలో 40శాతం మంది విద్యార్థినులు ఉండటం ఆనందంగా ఉందన్నారు. క్షిపణుల తయారీ రంగంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తుండటాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, విశాఖ ఎంపీ హరిబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

click me!