శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆలయంలో ప్రత్యేక పూజలు..

By Sumanth KanukulaFirst Published Dec 26, 2022, 1:56 PM IST
Highlights

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. శ్రీశైలం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీశైలం ఆలయంలో ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజులు నిర్వహించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంట హెలిప్యాడ్‌ వద్దకు చేరుకన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వాధికారులు స్వాగతం పలికారు. 

అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకన్నారు. శ్రీశైలం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీశైలం ఆలయంలో ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజులు నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని  ప్రసాద్ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్దికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ద్రౌపది ముర్ము ప్రారంభించారు. తర్వాత శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో అధికారులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దర్శనాలను రద్దు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించే ప్రదేశాలలో దుకాణాలను మూసివేశారు. శ్రీశైలం టోల్‌గేట్ నుంచి ఔటర్ రింగ్‌ రోడ్డు మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు. 

click me!