
తిరుపతి: భర్తతో గొడవపడి ఓ నిండు గర్భిణి కాలినడకన ఏకంగా 65 కిలోమీటర్లు ప్రయాణించిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా నడుస్తున్న క్రమంలోనే పురిటినొప్పులు రావడంతో రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. అదృష్టం బావుండి తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమంగానే వున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్సార్ నగర్ కు చెందిన కొత్తూరు వర్షిణి కూలీపనుల కోసం భర్తతో కలిసి తిరుపతికి వెళ్లింది. నిండు గర్భిణి అయిన ఆమెకు ఏలోటూ రాకుండా చూసుకోవాల్సిన భర్త చిటికీ మాటికీ గొడవపడేవాడు. భర్త తీరుతో విసిగిపోయిన ఇక తట్టుకోలేకపోయిన వర్షిణి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది.
భర్తపై కోపంతో ఇంట్లోంచి బయటకు వచ్చిందే కానీ చేతిలో చిల్లిగవ్వ లేదు. తిరిగి భర్త దగ్గరకు వెళ్లేందుకు ఆమె ఆత్మాభిమానం ఒప్పుకోలేదు. దీంతో నిండు గర్భంతో వున్న వర్షిణి కాలినడక ప్రారంభించింది. ఇలా తిరుపతిలో నడక ప్రారంభించి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో వున్న నాయుడుపేటకు చేరుకుంది. అప్పటకే ఆమె పూర్తిగా అలసిపోయింది.
నాయుడుపేట బస్టాండ్ సమీపానికి చేరుకోగానే వర్షిణికి పురిటినొప్పులు ప్రారంభయ్యాయి. దీంతో నొప్పి భరించలేక ఆమె రోడ్డుపైనే పడిపోయింది. ఇది గమనించిన ఓ యువకుడు మానవత్వం ప్రదర్శించాడు. వెంటనే వర్షిణి వద్దకు చేరుకుని ఆమె పురిటినొప్పితో బాధపడుతున్నట్లు తెలుసుకుని 108 అంబులెన్స్ కు ఫోన్ చేసాడు. దీంతో వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకుంది.
అయితే అప్పటికే ఆమెకు పురిటినొప్పులు వచ్చి చాలాసేపు కావడంతో ప్రసవానికి సమయంలేకుండా పోయింది. కడుపులోని బిడ్డ కిందకు జారుతుండటంతో మహిళను అంబులెన్స్ లోకి ఎక్కించి సిబ్బంది కిరణ్ కుమార్, చిరంజీవి వెంటనే ప్రసవం చేసారు. ఇలా రోడ్డుపైనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వర్షిణి పరిస్థితి చూసి చలించిపోయిన స్థానిక మహిళలు ఇళ్లలోంచి చీరలు, దుస్తులు తీసుకువచ్చి తల్లీ బిడ్డకు ఇచ్చారు.
పుట్టినబిడ్డ బరువు తక్కువగా వుడటంతో అంబులెన్స్ సిబ్బంది నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ తల్లీ బిడ్డకు వైద్యం అందించారు. మహిళ భర్త, కుటుంబసభ్యుల వివరాలు తెలిపేందుకు నిరాకరించడంతో హాస్పిటల్ సిబ్బంది దిశ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని మహిళ నుండి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.