అల్లూరి సీతారామరాజు జిల్లాలో గర్భిణి మృతి చెందింది. డోలిలో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆమె మృతి చెందింది.
విశాఖపట్టణం: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆసుపత్రికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక గర్భిణికి సకాలంలో వైద్యం అందలేదు. దీంతో ఆమె మృతి చెందింది. డోలీలో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఆమె మృతి చెందింది.జిల్లాలోని ముంచంగిపుట్టు మండలం ఉబ్బెంగికి చెందిన బసంతి అనే మహిళ గర్భిణి. ఆమె డెలీవరి సమయం వచ్చింది. గ్రామం నుండి ఆసుపత్రికి వెళ్లాలంటే గిరిజనులు కాలినడకన వెళ్లాల్సిందే. గర్భిణిని డోలిలో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే గర్భిణి మృతి చెందింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అదే డోలిలో గర్భిణి మృత దేహన్ని గ్రామానికి తరలించారు.
తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.ఏపీ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల వాసులకు సరైన రహదారి సౌకర్యం లేని కారణంగా ఆసుపత్రులకు వెళ్లడానికి డోలిలను ఆశ్రయిస్తున్నారు. వర్షాకాలంలో డోలిల సహయంతో గ్రామాలనుండి ఆసుపత్రులకు వెళ్లడానికి గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
విజయనగరం జిల్లాలోని ఎస్.కోట మండలం మూలబుద్దవరపు పంచాయితీ పరిధిలో మజ్జి గంగమ్మ అనే మహిళ గర్భవతి. ఆమెను అంబులెన్స్ వరకు తీసుకెళ్లేందుకు డోలిలో 10 కి.మీ. పాటు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన 2021 డిసెంబర్ 21న జరిగింది.విజయనగరం జిల్లాలోని పొట్టంగి పార్వతి అనే మహిళ గర్భవతి. ఆమెను మూడు కిలోమీటర్ల దూరం వరకు డోలిలో మోసుకెళ్లారు కుటుంబ సభ్యులు. తడిలోవ గ్రామం నుండి వాహనంలో ఆమెను బొగ్గువలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటన 2021 జూన్ 27న చోటు చేసుకుంది.