డోలిలో గర్బిణీని 5 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు

By narsimha lodeFirst Published Jul 21, 2019, 3:10 PM IST
Highlights


దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇంత కాలమైనా గ్రామాలకు రోడ్డుతో పాటు వైద్య సౌకర్యం లేక డోలిలో గర్భిణీని మోసుకెళ్లారు కుటుంబసభ్యులు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది. మండలకేంద్రానికి 11 కి.మీ దూరంలోనే ఈ గ్రామం ఉంది.

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా జి.మాడ్గుల మండలం కొత్తవలస గ్రామానికి చెందిన గర్భిణీని 5 కి.మీ. దూరం పాటు డోలిలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొత్తవలస గ్రామానికి చెందిన జానపరెడ్డిదేవీ నిండు గర్భిణీ. ఆమెకు  సాధారణ ప్రసవం అవుతుందని కుటుంబసభ్యులు భావించారు.  కానీ ఆమె కడుపులో బిడ్డ అడ్డంగా తిరిగింది. సాధారణ ప్రసవం కాదని కుటుంబసభ్యులు గుర్తించారు.

దీంతో గ్రామస్తుల సహాయంతో కుటుంబసభ్యులు 5 కి.మీ దూరం తీసుకెళ్లారు. ఈ గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ఉంటుంది. వర్షం వస్తే గ్రామానికి వాహనాలు రావు.  ఉన్న రోడ్డు కూడ వర్షంతో కనీసం వాహనాలు నడిచే  పరిస్థితి ఉండదు.

మాడ్గుల నుండి  తమ గ్రామం 11 కి.మీ దూరం ఉంటుందని గ్రామస్తులు చెప్పారు. రోడ్డు సౌకర్యం లేని కారణంగా సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయం లేకపోవడంతో  ఇద్దరు ముగ్గురు మృతి చెందారని గ్రామస్తులు చెప్పారు.

జానపరెడ్డి దేవీని డోలికి కట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రిలో డాక్టర్ లేరు. నర్సులే ఆమెకు వైద్యం నిర్వహించినట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఆసుపత్రిలో ఆమెకు సురక్షితంగా ప్రసవం జరిగినట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబసభ్యులు ప్రకటించారు. 

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ విషయమై డిఎంహెచ్ఓ తో ఆన ఫోన్లో మాట్లాడి వివరాలను తెలుసుకొన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ విషయమై మంత్రి అవంతి శ్రీనివాస్ దృష్టికి మీడియా తీసుకెళ్లింది. కొత్త వలస గ్రామానికి  రోడ్డు సౌకర్యాన్నిఏర్పాటు చేస్తామని ఆయన :హామీ ఇచ్చారు.


 

click me!