కాన్పు కోసం వెళితే కానరాని లోకాలకు... వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో గర్బిణి మృతి

By Arun Kumar PFirst Published Apr 22, 2020, 10:54 AM IST
Highlights

ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బంది  నిర్లక్ష్యం కారణంగా కాన్పుకోసం వెళ్లిన నిండు  గర్భిణి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

విజయవాడ: వైద్యసిబ్బంది నిర్లక్ష్యం ఓ నిండు గర్భిణి మృతికి కారణమవడమే కాదు అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను తల్లిప్రేమకు దూరం చేసింది. తొమ్మిది నెలలు కడుపులో మోసిన కన్నబిడ్డను కల్లారా చూసుకోకుండానే బాలింత మృతిచెందిన విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. డాక్టర్లు లేకుండా కేవలం నర్సులే ఆపరేషన్ చేయడంతో సదరు మహిళ మృతిచెందినట్లు కుటుంబసభ్యులు వాపోతున్నారు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  ఉయ్యూరు మండలం పెద ఓగిరాల గ్రామానికి చెందిన  కనగాల ఆదిలక్ష్మి (25)  అనే గర్భిణి. ఇటీవలఆమెకు పురిటినొప్పులు రావడంతో ఉయ్యూరు ప్రభుత్వాత్రికి తరలించారు. అయితే అక్కడ గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోయినా మిగతా వైద్య సిబ్బంది ఆమెకు ఆపరేషన్ చేశారు. 

అయితే పుట్టిన బిడ్డ క్షేమంగానే వున్నా తల్లికి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. వైద్య  సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె గర్భసంచి బయటకు వచ్చింది. దీంతో వారు చేతులెత్తేయడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే అప్పటికే చాలా ఆలస్యం అవడంతో ఆమె ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు. 

ఇలా ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రి  వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. దీంతో వైద్యసిబ్బంది తీరుపై ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు దిక్కెవరంటూ ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడటమే కాదు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలను బలితీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 


 

click me!