ఇరకాటంలో జగన్... రాయలసీమ ఎత్తిపోతలపై స్వరాష్ట్రంలోనూ వ్యతిరేకత

By Arun Kumar PFirst Published Jul 11, 2021, 11:51 AM IST
Highlights

ఇప్పటికే నదీజలాల పంపిణీ విషయంలో పక్కరాష్ట్రం తెలంగాణతో వివాదం రేగిన నేపథ్యంలోనే సొంత రాష్ట్రంలోనూ జగన్ సర్కార్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. 

అమరావతి: తెలుగురాష్ట్రాల మధ్య జలజగడానికి రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం ప్రధాన కారణం. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఈ ప్రాజెక్టును జగన్ సర్కార్ నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టు విషయంలో సొంత రాష్ట్రంలో కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు సీఎం జగన్. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల ప్రకాశం జిల్లా రైతాంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందంటూ ఆ జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయుల, ఏలూరి సాంబశివరావు సీఎం జగన్ కు లేఖ రాశారు. 

 ''శ్రీశైలం జలాశయం వద్ద నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఇప్పటికే కరువుతో అల్లాడిపోతున్న ఈ జిల్లా రైతాంగం గొంతు కోయొద్దని వేడుకుంటున్నాం. దీని నిర్మాణం పూర్తయితే ప్రకాశం జిల్లా ఎడారిగా మారుతుంది'' అంటూ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. 

''ప్రకాశం జిల్లాలోని పంట భూములన్నీ భూగర్భ జలాలు, సాగర్ పైనే ఆధారపడి వున్నాయి. 15 ఏళ్లలో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయ్యింది. మిగిలిన పన్నెండేళ్లు ప్రకాశం జిల్లాలో కరువే. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మరింత చేటు చేసేలా ఉన్నాయి'' అని అన్నారు. 

read more  ఏపీతో తాడోపేడో:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌‌పై సుప్రీంకి కేసీఆర్ సర్కార్

''శ్రీశైలం నిండితేనే నాగార్జునసాగర్ కు నీళ్లు... సాగర్ నిండితేనే ప్రకాశం జిల్లాకు నీళ్లు వస్తాయి. అలాంటిది శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండా మీరు, తెలంగాణ వారు ప్రాజెక్టులు కట్టుకుంటే మా పరిస్థితి ఏమిటి? మీరు నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంతో మా కరువు జిల్లా పరిస్థితి ఏమిటి..?'' అని ప్రశ్నించారు. 

''రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు 44వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కుల పెంపుపై పునరాలోచించి ఉపసంహరించుకోవాలి. గుంటూరు ఛానల్ ను దగ్గుబాడు వరకు పొడిగించి ప్రజల దాహార్తిని తీర్చడమే కాదు పంటలకు సాగునీరు ఇవ్వాలి'' అని టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి, డోలా, ఏలూరు డిమాండ్ చేశారు. 

click me!