టిడిపికి ఆగష్టు సంక్షోభం ? కారణాలు ఇవేనా ?

First Published Mar 23, 2018, 2:14 PM IST
Highlights
  • ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటంతో రాష్ట్ర రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరుగుతోంది.

తెలుగుదేశంపార్టీని ఆగష్టు సంక్షోభం వెంటాడుతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కేంద్రమంత్రివర్గం నుండి టిడిపి తప్పుకోవటం, తర్వాత ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటంతో రాష్ట్ర రాజకీయాలు విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. రోజురోజుకు శరవేగంగా మారిపోతున్న రాజకీయపరిణామాల్లో చంద్రబాబునాయుడు పావుగా మారిపోతున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు.

నిజానికి కేంద్రమంత్రివర్గంలో నుండి టిడిపి తప్పుకుంటుందని కాని ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేస్తుందని గాని ఎవరూ ఊహించలేదు. అయితే, రెండూ జరిగాయంటే వైసిపి ఆడిన మైండ్ గేమ్ ఒక కారణమైతే, జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా పవన్ కల్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలు మరో కారణంగా చెప్పుకోవచ్చు.

ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చేసిందో అప్పటి నుండి చంద్రబాబు లక్ష్యంగా బిజెపి కూడా పావులు కదుపుతోంది. ఒకేసారి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో వైసిపి, జనసేనలు దాడులు మొదలుపెట్టాయో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఆ టెన్షన్ తోనే గంటకో మాట మాట్లాడుతున్నారు.

పార్టీలో మంత్రులు, ఎంఎల్ఏల పరిస్ధితి చూస్తుంటే చంద్రబాబు అదుపు తప్పిపోయినట్లే కనబడుతోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విషయం చూస్తే చంద్రబాబు, లోకేష్ మధ్య వర్గాలుగా విడిపోయారని బాగా ప్రచారంలో ఉంది.

ఇటువంటి నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు రావన్న అనుమానం ఉన్న పలువురు ఎంఎల్ఏలు ఇటు జగన్ అటు పవన్ తో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాబట్టి కొద్ది రోజుల్లో తమ భమవిష్యత్ పై వారు నిర్ణయం తీసుకోవటం ఖాయం. ఆవిర్భావ దినోత్సవంలో పవన్ మాట్లాడుతూ, చంద్రబాబు, లోకేష్ అవినీతిపై 40 మంది ఎంఎల్ఏలు తనకు ఫిర్యాదు చేశారని చెప్పటంతో టిడిపిలో కలకలం మొదలైంది.

చంద్రబాబు అనుమానిస్తున్నట్లుగానే ఒకవేళ కేంద్రం గనుక సిబిఐ దాడులు చేయిస్తే అక్కడితో టిడిపి కథ ముగిసినట్లే అనే ప్రచారం ఊపందుకోవటం గమనార్హం. అదే గనుక నిజమైతే చంద్రబాబుకు సమస్యలు మొదలైనట్లే. అదే సమయంలో చంద్రబాబును బోనెక్కించనిదే తగ్గేది లేదంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బహిరంగంగా సవాలు విసిరిన సంగతి అందరికీ తెలిసిందే.

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పై ఘటనలు జరగటానికి అవకాశాలున్నట్లే కనబడుతోంది. అంటే, త్వరలో టిడిపికి ఆగష్టు సంక్షోభం తప్పదన్న సంకేతాలు ఇవేనేమో?

 

click me!