ఏపిపై కేంద్రానికి ఎందుకంత నిర్లక్ష్యం ?

Published : Jan 20, 2017, 03:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఏపిపై కేంద్రానికి ఎందుకంత నిర్లక్ష్యం ?

సారాంశం

తానిచ్చిన హామీలను తానే తుంగలో తొక్కినా రాజకీయ పార్టీలు గానీ ప్రజలు గానీ పట్టించుకోరన్న ధీమానే కారణమా? నిజానికి జరుగుతున్నది కూడా అదే కదా?

కేంద్రప్రభుత్వం ఏపిని మరీ తీసిపరేసినట్లు కనబడుతోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళయినా రాష్ట్రానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ప్రధాని మోడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నికలకు ముందు   మిత్రపక్షం టిడిపితో కలిసి జంటగా ఇచ్చిన ‘ప్రత్యేక’ హామీలను అధికారంలోకి రాగానే తూచ్ అనేసారు. దానికితోడు చంద్రబాబు కూడా కేంద్రంపై పట్టుకోల్పోవటంతో కేంద్రం ఏమి చేసినా, చేయకున్నా నిలదీసే అవకాశాన్ని కోల్పోయారు.

 

అదే తమిళనాడు విషయం చూస్తే భిన్నంగా ఉంది. ప్రస్తుత ‘జల్లికట్టు’ వివాదాన్నే తీసుకుంటే మూడురోజుకల్లా స్వయంగా ప్రధానమంత్రే స్పందించటం గమనార్హం. జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా యావత్ తమిళనాడు స్పందించింది. దాంతో రాజకీయపార్టీలు, సినిమా రంగంతో పాటు విద్యా, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాలన్నీ స్వచ్ఛంగా మద్దతు ప్రకటించాయి. దాంతో కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది.

 

వెంటనే సిఎం పన్నీర్ శెల్వం స్వయంగా మోడితో సమావేశమై జల్లికట్టుకు అనుకూలంగా ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ విజ్ఞప్తి చేసారు. వెంటనే మోడి కలగచేసుకుని జల్లికట్టు ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యత గురించి ప్రకటించారు. అయితే, అంశం న్యాయస్ధానం పరిధిలో ఉందికాబట్టి ఏమి చేయాలనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అంటే అర్ధంఏమిటి? తమిళ ప్రజలను ప్రసన్నం చేసుకోవాలనే ఆత్రుతే మోడిలో కనబడుతోంది. ఎందుకంటే, తమిళనాడులో ఇపుడు భాజపాకు ఉనికి కూడా లేదు. ఇప్పటి నుండి క్రియాశీలమవ్వాలని ప్లాన్ వేస్తున్నారు.

 

జయలలిత మరణం తర్వాత అధికార రాజకీయాల్లో వేలుపెడదామని ప్రయత్నించి భంగపడ్డారు. దాంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్ధితిలో ఉండగానే జల్లికట్టు వివాం అందివచ్చింది. పరిస్ధితులను అనుకూలంగా మార్చుకునేందుకు ఏ అమిత్ షానో లేక వెంకయ్యనాయుడునో పంపకుండా స్వయంగా మోడినే రంగంలోకి దిగారు. అందుకనే జల్లికట్టుపై అంత త్వొరగా స్పందించారు. తమిళనాడు రాజకీయాల్లో వేలు పెడితే రాష్ట్రంలోని పార్టీలు, ప్రజలు ఏకమై కేంద్రాన్ని చీల్చి చెండాడేస్తారని మోడికి అర్ధమైపోయింది. అందుకనే జల్లకట్టును అడ్డుపెట్టుకుని రాజకీయాలు నడపాలని చూస్తున్నట్లుంది.

 

మరి, ఏపి విషయంలో మాత్రం ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మోడి? తానిచ్చిన హామీలను తానే తుంగలో తొక్కినా రాజకీయ పార్టీలు గానీ ప్రజలు గానీ పట్టించుకోరన్న ధీమానే కారణమా? నిజానికి జరుగుతున్నది కూడా అదే కదా? అంతేకాకుండా,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కేసులున్నాయి. ఈ కేసులున్నంతకాలం వారు కేంద్రంపై ఆధారపడే రాజకీయాలు నడపాలి. లేకపోతే వారి బ్రతుకు బస్టాండే. అధికార-ప్రధాన ప్రతిపక్షం ఇలా ఏకమైన తర్వాత కేంద్రం మాత్రం ఏపిని ఎందుకు పట్టించుకుంటుంది?   

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Train Fire : విశాఖపట్నంలో ఘోర ప్రమాదం.. రైలులో చెలరేగిన మంటలు
IMD Cold Wave Alert : ఈ ఎనిమిది జిల్లాల్లో సూపర్ కూల్ పరిస్థితి... ఈ రెండ్రోజులు మరింత జాగ్రత్త