Latest Videos

అధికారంలో ఉంటే అన్నీ చౌకే.. రూ.కోట్ల విలువైన స్థలాలను పార్టీలు ఇలా కొట్టేస్తున్నాయ్!

By Galam Venkata RaoFirst Published Jun 23, 2024, 10:30 AM IST
Highlights

రూ.కోట్ల విలువైన స్థలాలను రాజకీయ పార్టీ తమ కార్యాలయాలకు నామమాత్రపు ధర/ లీజుకు సొంతం చేసుకుంటున్నాయి. పేదలకు సెంటు స్థలం ఇవ్వడానికి వంద కొర్రీలు పెట్టే ప్రభుత్వాలు ఇలా ఎలా చేస్తున్నాయంటే..?

తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కూల్చివేత ఆంధ్రప్రదేశ్‌లో వివాదాస్పదమైంది. వచ్చీరాగానే చంద్రబాబు ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ మండిపడుతోంది. తాడేపల్లిలో పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలో నిబంధనలన్నీ పాటించామని వైసీపీ చెబుతుంటే... అసలు అనుమతులే లేకుండా భవనం నిర్మించేశారని టీడీపీ వాదిస్తోంది. న్యాయస్థానం అనుమతులతోనే వైసీపీ భవనాన్ని కూల్చేశామని సీఆర్డీయే, తాడేపల్లి మున్సిపల్‌ అధికారులు చెబుతుండగా... కోర్టు ఆదేశాలు ధక్కిరించి తమ కార్యాలయాన్ని అక్రమంగా నేలమట్టం చేశారని వైసీపీ వాపోతోంది. 

ఎవరి వాదన ఏదైనా... పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏళ్లకు ఏళ్లు కార్యాలయాల చుట్టూ తిప్పుకొనే ప్రభుత్వాలు.... అధికారంలో ఉన్నప్పుడు తమకు కావాల్సిన చోట కావాల్సినంత విస్తీర్ణంలో విశాలంగా పార్టీ ఆఫీసులు మాత్రం నిర్మించేసుకుంటున్నాయి. ఇలా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రాజకీయ పార్టీలు తమకు ఇష్టమొచ్చినట్లు చట్టాలు చేసుకుంటున్నాయి. నామమాత్రపు లీజుతో ఎకరాలకు ఎకరాల స్థలాల్లో పార్టీ ఆఫీసులు నిర్మించుకుంటున్నాయి. 

తాడేపల్లి కార్యాలయం కూల్చివేత నేపథ్యంలో వైసీపీ ఓ వాదనను బలంగా వినిపిస్తోంది. ‘‘రాజకీయ పార్టీల కార్యాలయాలకు స్థలాలు ఇవ్వాలని జీవో తీసుకొచ్చిందే గత చంద్రబాబు ప్రభుత్వం. పార్టీ కార్యాలయాలకు స్థలాలకు కేటాయించేందుకు గత టీడీపీ ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిందని వాదిస్తోంది. 175 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది బలం ఉన్న పార్టీకి ప్రతి చోటా 4 ఎకరాలు స్థలం ఇవ్వాలని జీవో తీసుకొచ్చారు’’ అని వైసీపీ హయాంలో అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఏఏజీ పదవి నుంచి ఆయన తప్పుకొన్నారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయం కేసును ఆయనే వాదిస్తున్నారు. ఇక, టీడీపీ ఆఫీస్‌ నిర్మాణానికి కడప జిల్లాలో ఎకరా, మంగళగిరి మండలం ఆత్మకూరులో 3.65 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 2 ఎకరాలు, గుంటూరులో 3.65 ఎకరాలు... ఇలా విజయనగరం, కృష్ణా, ప్రకాశం, చిత్తూరులో స్థలాలు కేటాయించుకున్నారట. అయితే, దీనికి ఎకరాకు రూ.1000 లీజు మాత్రమే నిర్ణయించడం గమనార్హం. 

ఆ నిబంధనల ప్రకారమే తాము కూడా ఎకరానికి రూ.1000 లీజు చెల్లించి పార్టీ ఆఫీసుల నిర్మాణానికి భూములు తీసుకున్నట్లు వైసీపీ చెబుతోంది. అయితే, వెయ్యి రూపాయల లీజు వైసీపీయే నిర్ణయించిందని టీడీపీ వాదిస్తోంది. 

అయితే, ఏదైనా ప్రభుత్వ స్థలంలో భవనం నిర్మించాలంటే సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అలా అనుమతులు తీసుకోకుండానే తాడేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో వైసీపీ నిర్మిస్తున్న భవనాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. ఇక, అనకాపల్లిలోనూ జీవీఎంసీ అనుమతులు లేకుండా హైవే సమీపంలో వైసీపీ మరో కార్యాలయం నిర్మిస్తోందని టీడీపీ చెబుతోంది. 1.75 ఎకరాలు 33 ఏళ్లు లీజుకు తీసుకుందని సోషల్ మీడియాలో పోస్టో చేసింది. ఇప్పటికే తాడేపల్లిలో నిర్మాణాన్ని కూల్చివేసిన నేపథ్యంలో అనకాపల్లిలో భవనాన్ని ఏం చేస్తుందో వేచి చూడాలి మరి. అయితే, 


తెలంగాణలో ఇదీ పరిస్థితి..
గతంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌.. టీఆర్‌ఎస్‌గా అధికారంలో ఉన్నప్పుడు నామమాత్రపు ధరకే పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించింది. ఇందుకోసం కొత్త పాలసీలు చేసింది. జిల్లా కేంద్రాల్లో మంచి డిమాండ్‌ ఉన్న స్థలాలను చీప్‌ రేట్‌కే పార్టీ ఆఫీసుల కింద తీసుకుంది. దీంతో అప్పట్లో రెవన్యూ అధికారులు నిర్ధారించిన ధర కోట్ల నుంచి లక్షల రూపాయలకు దిగి రావాల్సి వచ్చింది. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలన్నీ జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకునేందుకు చదరపు గజానికి రూ.వంద చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది. అలా జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బీఆర్‌ఎస్‌ కార్యాలయాలు నిర్మించింది. అన్ని జిల్లాల్లో దాదాపు ఎకరా విస్తీర్ణంలో ఆఫీసులు కట్టేసింది. మార్కెట్‌లో భారీగా ధర పలికే స్థలాలను కూడా అప్పట్లో తక్కువ ధరకే పార్టీ కార్యాలయానికి కేటాయించడం వివాదాస్పదమైంది. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం గుర్తించిన స్థలం రూ.కోట్లలో పలికింది. ఇక్కడ 36 గుంటల (ఎకరా= 40 గుంటలు) స్థలాన్ని టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి ఎంపిక చేయగా... ఓపెన్‌ మార్కెట్‌ ప్రకారం అధికారులు విలువ నిర్ధారించారు. అప్పట్లో గుంటకు రూ.10లక్షల చొప్పున 36గుంటలకు రూ.3.65 కోట్లు అని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. దీంతో అధికారులు టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు భగ్గుమన్నాయి. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ ప్రకారం చదరపు గజం రూ.100 చొప్పున.. 36 గుంటల భూమిని ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రూ.4.35 లక్షలకే కేటాయించారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతంలో ఇలా పరిస్థితే. హైదరాబాద్‌లో స్థలాల ధరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

click me!