ఏలూరు టీడీపి అభ్యర్థి లగడపాటి: వైసిపి అభ్యర్థి కావూరి?

తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు లోకసభ స్థానానికి మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కంభంపాటి రామ్మోహన్ రావు పేరు కూడా తెర మీదికి వచ్చింది. అయితే లగడపాటి ఆ విషయం ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడలేదని కూడా అంటున్నారు.
మాజీ పార్లమెంటు సభ్యుడు, బిజెపి నాయకుడు కావూరి సాంబశివ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని, వైసిపి నుంచి ఆయన ఏలూరు లోకసభ స్థానానికి పోటీ చేయవచ్చునని ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పటి వరకు ఏలూరు నియోజకవర్గం నుంచి జగన్ కోటగిరి శ్రీధర్ ను బరిలోకి దింపుతారని అనుకుంటూ వస్తున్నారు. కావూరి వస్తే, శ్రీధర్ ను శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించవచ్చునని అంటున్నారు.
ప్రస్తుతం ఏలూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మాగంటి బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆయన కాదనుకుంటే తప్ప టీడీపి టికెట్ మరొకరికి ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అయితే, మాగంటి బాబు ఏలూరు నుంచి పోటీ చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది.
మాగంటి బాబును పక్కన పెట్టి మాజీ ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య మనవడు రాజీవ్ ను ఏలూరు నియోజకవర్గం నుంచి పోటీకి దింపవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ రాజీవ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో రాజీవ్ భేటీ అయ్యారు.
కావూరి సాంబశివ రావును పోటీ చేయకుండా చూడడానికే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజీవ్ పేరును తెర మీదికి తెచ్చినట్లు చెబుతున్నారు. ఒకే ఇంటి నుంచి వేర్వేరు పార్టీల నుంచి పోటీ దిగితే మంచిది కాదనే ఉద్దేశంతో కావూరి పోటీ నుంచి తప్పుకోవచ్చునని అంటున్నారు. అప్పుడు వైసిపి అభ్యర్థిగా కోటగిరి శ్రీధర్ ను దింపి అవకాశాలుంటాయని చెబుతున్నారు.
ఈ నెల 26వ తేదీన గానీ 29వ తేదీన గానీ కావూరి సాంబశివ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన వైసిపిలో చేరుతురంటూ ప్రచారం సాగుతోంది. కావూరి మాత్రం ఆ విషయంపై ఏమీ మాట్లాడడం లేదు.
By rajesh yFirst Published 21, Feb 2019, 11:45 AM IST