టికెట్ల కోసం దరఖాస్తులు: పవన్ కల్యాణ్ డెడ్ లైన్ ఇదే...

జనసేన అభ్యర్థిత్వం కోరుతూ ఆశావహుల నుంచి వస్తున్న బయో డేటాల స్వీకరణకు తుది గడువుగా ఈ నెల 25వ తేదీని నిర్ణయించినట్లు స్క్రీనింగ్ కమిటీ ప్రకటించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు జనసేన తరఫున బరిలో నిలవాలనుకొనే ఆశావహుల నుంచి గత వారం రోజుల నుంచి బయో డేటాలు తీసుకుంటున్నారు.
బుధవారం స్క్రీనింగ్ కమిటీ ముందుకు 170 మంది వచ్చారు. మాదాసు గంగాధరం, అర్హం ఖాన్, టి.శివశంకర్, మహేందర్ రెడ్డి, పి.హరిప్రసాద్ లతో కూడిన స్క్రీనింగ్ కమిటీ ఆశావహులతో మాట్లాడి పరిశీలన చేస్తోంది. బుధవారం ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలవారు ఎక్కువ మంది వచ్చారు.
ఉత్తరాంధ్రలోని కురుపాం, పాడేరు, పాలకొండ, అరకు, సాలూరు రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కోరుతూ విద్యావంతులు వచ్చారు. ఇందులో వైద్య వృత్తిలో ఉన్న యువకులు కూడా ఉన్నారు. అలాగే రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తూ పలువురు విద్యావంతులు వచ్చారు.
స్థానికంగా రాజకీయ, సామాజిక రంగాల కుటుంబ నేపథ్యం ఉన్న గృహిణులు జనసేన తరఫున బరిలో నిలవాలని ఉత్సాహం చూపిస్తూ బయో డేటాలు ఇచ్చారు. నవతరం ఆకాంక్షలు జనసేన ద్వారానే కార్యరూపం దాల్చుతాయనే విశ్వాసం బయో డేటాలు ఇచ్చేందుకు వచ్చిన ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు.
పాలనలో జవాబుదారీతనం, బడుగు బలహీనవర్గాల సంక్షేమం శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్ధాంతాలు ద్వారానే సాధ్యమవుతాయని వారు విశ్వసిస్తున్నారు.
By rajesh yFirst Published 21, Feb 2019, 11:13 AM IST