
ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీసులు అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. విజయవాడ సీపీ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు జగ్గయ్యపేట ఆటోనగర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైకులపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వీరు ముగ్గురూ కలిసి మోటారు సైకిళ్లు దొంగతనం చేసుకుని అమ్మకుంటూ ఆ డబ్బుతో జల్సాలు చేస్తున్నారని తేలింది. అలా వారు ఎన్టీఆర్ జిల్లాలో 11 , ప్రకాశం జిల్లాలో 11, గుంటూరు జిల్లాలో 15, తెలంగాణలో 3 మోటార్ సైకిళ్ళు మొత్తం 40 వాహనాలు దొంగతనం చేసినట్లు, వాటిలో 19 వాహనాలను కే.అగ్రహారం అట్టల ఫ్యాక్టరీ నందు 19 వాహనాలు దాచినట్లు పోలీసులు గుర్తించారు.
గుంటూరు జిల్లా నరసరావుపేట చెందిన A4 కొమ్మిశెట్టి కోటేశ్వరరావు అనే వ్యక్తికి 20 మోటార్ సైకిళ్ళు అమ్మినట్లు తేలింది. అనంతరం నిందితుల నుంచి మొత్తం 40 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకన్నారు. వీటి విలువ సుమారు 25 లక్షలు రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఈకేసులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా అభినందనలు తెలిపి, రివార్డ్‌లు అందజేశారు.