ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అర్చకులు..

By Sumanth KanukulaFirst Published Sep 28, 2022, 1:09 PM IST
Highlights

విజయవాడ‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

విజయవాడ‌లోని కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంద్రకీలాద్రిపై బుధవారం ఉదయం ఆలయ స్థానాచర్య, ప్రధానర్చకులను పోలీసులు అడ్డుకున్నారు. లిఫ్ట్ మార్గం ద్వారా అనుమతించకుండా తాళాలు వేశారు. డ్యూటీ పాస్ చూపించినప్పటికీ పోలీసులు వారితో దురుసుగా ప్రవర్తించారు. నీకు నచ్చింది చేసుకో అంటూ దురుసుగా మాట్లాడారు. 

అయితే పోలీసుల తీరుపై అర్చకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ పేరుతో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఇలా తమను అడ్డుకుంటే విధులు నిర్వర్తించలేమని అర్చకులు అంటున్నారు. ఈ విషయాన్ని అర్చకులు జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారుల ఆదేశానుసారమే తాము పనిచేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 

Watch: నేడు గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్న విజయవాడ దుర్గమ్మ

అర్చకులతో పోలీసుల వివాదంపై జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్పందించారు. ఆలయ ఈవో, ఉత్సవ ప్రత్యేక అధికారి, పోలీసులు, వైదిక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. అనుమతి ఉన్నవారిని, పాస్‌లు ఉన్నవారిని లోనికి అనుమతించాలని కలెక్టర్ సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే శరన్నవరాత్రి ఉత్సవాల తొలిరోజు నుంచే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇక, దసరా శరన్నవరాత్రి వేడుకలు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి వేడుకల్లో మూడోరోజయిన ఇవాళ(బుధవారం) దుర్గమ్మ గాయత్రీ దేవి అవతారంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. 

click me!