నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో తలెత్తిన భూ వివాదంపై సమాధానం చెప్పాలని ఆయనకు ఈ నోటీసులు ఇచ్చారు. నెల్లూరు రూరల్ సర్కిల్ సీఐ రామకృష్ణ పేరిట తయారైన నోటీసును వెంకటాచలం ఎస్‌ఐ కరీముల్లా శుక్రవారం అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లి అందజేశారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగలింది. భూ వివాదం కేసులో పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఇడిమేపల్లి గ్రామంలో తలెత్తిన భూ వివాదంపై సమాధానం చెప్పాలని ఆయనకు ఈ నోటీసులు ఇచ్చారు. నెల్లూరు రూరల్ సర్కిల్ సీఐ రామకృష్ణ పేరిట తయారైన నోటీసును వెంకటాచలం ఎస్‌ఐ కరీముల్లా శుక్రవారం అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లి అందజేశారు.
ఇడిమేపల్లిలో కొందరు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... దానికి సంబంధించిన పూర్వాపరాలను విచారించేందుకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. 91 సీఆర్పీసీ మేరకు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నోటీసు అందజేసి ఒక గంట వ్యవధిలో... అంటే 7 గంటలకు వెంకటాచలం వచ్చి వివరాలు చెప్పాలన్నారు.
కాగా... దీనిపై సోమిరెడ్డి తాజాగా స్పందించారు. గంట సమయంలో విచారణకు ఎలా హాజరు అవుతారని ప్రశ్నించారు. పైగా ఈ నెల మూడో తేదీన నోటీసు జారీ చేసినట్లు అందులో ఉండటంతో దానిని సరిచేయాలని సోమిరెడ్డి సూచించారు. అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడిన ఎస్‌ఐ... సోమవారం హాజరుకావాలని సోమిరెడ్డిని కోరారు. దీనికి ఆయన సమ్మతించారు.