ముద్రగడ హౌస్ అరెస్ట్

First Published Jul 26, 2017, 10:08 AM IST
Highlights
  • ఉద్రిక్తత నెలకొంటుందన్న సాకుతో ప్రభుత్వం ముద్రగడను అడ్డుకుంది. పోలీసులు హౌస్ అరెస్టు చేసారు.  
  • పోలీసులు తనను స్వేచ్చగా పాదయాత్రకు అనుమతించే వరకూ తాను ఇంట్లో నుండి బయటకు రానని ముద్రగడ తాజాగా చెబుతున్నారు.
  • ముద్రగడ ఉద్యమాలను పక్కనబెట్టేవరకూ గృహనిర్బంధం తప్పదని పోలీసులు చెబుతున్నారు.
  •  

ముద్రగడను పోలీసులు బుధవారం హౌస్ అరెస్ట్ చేసారు. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర వివాదం ఎప్పటికి పరిష్కారమవుతుంది? కిర్లంపూడి ఎందుకు పోలీసు దిగ్బంధంలో ఉంది? అసలు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ముద్రగడ విషయంలో మొదటినుండీ ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తోందో అర్ధం కావటం లేదు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకునేందుకు, పాదయాత్రను అడ్డుకోవటం వల్ల తలెత్తిన ఉద్రిక్తతను అదుపులో పెట్టేందుకు తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 7 వేల మంది పోలీసులను మోహరించటం చూస్తుంటే అసలు కిర్లంపూడి తూర్పు గోదావరి జిల్లాలో ఉందా లేక కాశ్మీర్ సరిహద్దుల్లో ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అసలు, ముద్రగడ పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి? ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు? పోయిన ఎన్నికల్లో కాపులను బిసిల్లో చేరుస్తామని స్వయంగా చంద్రబాబు హమీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయారు. ముద్రగడ హామీనీ గుర్తు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. అప్పుడు ముద్రగడ ఉద్యమాలంటూ రోడ్లపైకి వచ్చారు. మొదటగా తునిలో నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా రత్నాచల్ ట్రైన్ కు కొందరు నిప్పుపెట్టారు. దాంతో ఉభయగోదావరి జిల్లాల్లో ఇదే విషయమై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అప్పటి నుండి తుని రైలు దహనాన్ని సాకుగా చూపుతూ ముద్రగడ ఎప్పుడు బహిరంగసభ, సైకిల్ ర్యాలి, పాదయాత్ర అన్నా అడ్డుకుంటోంది. ఇలా ఎంతకాలం? అదే తెలియటం లేదు. లెక్కప్రకారం ఈరోజు నుండి కిర్లంపూడి నుండి అమరావతి వరకూ ముద్రగడ పాదయాత్ర జరగాలి. అయితే, ఉద్రిక్తత నెలకొంటుందన్న సాకుతో ప్రభుత్వం ముద్రగడను అడ్డుకుంది. ముద్రగడను పోలీసులు హౌస్ అరెస్టు చేసారు. ముద్రగడతో పాటు పలువురు కాపు నేతలను కూడా హౌస్ అరెస్టు చేసారు. 

పోలీసులు తనను స్వేచ్చగా పాదయాత్రకు అనుమతించే వరకూ తాను ఇంట్లో నుండి బయటకు రానని ముద్రగడ తాజాగా చెబుతున్నారు. ముద్రగడ ఉద్యమాలను పక్కనబెట్టేవరకూ గృహనిర్బంధం తప్పదని పోలీసులు చెబుతున్నారు. అంటే ఈ సమస్య ‘విత్తుముందా చెట్టుముందా’ అన్నట్లు తయారైంది. అంటే ఇప్పటితో ఈ సమస్య పరిష్కారం కాదన్న విషయం అర్ధమైపోతోంది. ఒకరకంగా ముద్రగడ-ప్రభుత్వానికి మధ్య టామ అండ్ జెర్రీ షో నడుస్తున్నట్లే ఉంది. ముద్రగడ పాదయాత్రకు మద్దతుగా రాష్ట్రంలోని కాపు ప్రముఖులందరూ కిర్లంపూడికి చేరుకున్నారు. అయితే, వారెవరినీ ముద్రగడను కలవటానికి పోలీసులు అనుమతించటం లేదు. అందుకనే వారిలో చాలామంది చుట్టుపక్కల గ్రామాల్లో మకాం వేసారు.

 

 

 

click me!