
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏయూ పాలకమండలి ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులతో పాటు పలు విద్యార్థి సంఘాలు చలో ఆంధ్రా యూనివర్సిటీ (Chalo Andhra University) పిలుపునిచ్చింది. మరోవైపు ఇందుకు పోటీగా ఏయూ పరిరక్షణ పోరాట సమితి మహాధర్నాకు సిద్దమైంది. దీంతో యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎటువంటి ఘర్షణ చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇక, యూనివర్సిటీకి చెందిన మూడు గేట్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గేట్ల గుండా కేవలం ఐడీ కార్డులు ఉన్నవారినే పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు. ఏయూ పరిసరాలకు చేరుకుంటున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి సమీప పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే తాము ఎలాగైనా చలో ఏయూ చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు.
చలో ఏయూ పిలుపు నేపథ్యంలో టీడీపీ, జనసేన, సీపీఎం పార్టీలకు చెందిన పలువురు నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జనసేన నాయకులు పీలా రామకృష్ణ, కోన తాతారావు, దల్లి గోవిందరెడ్డి, టీడీపీ నాయకులు పుచ్చా విజయకుమార్, మొల్లి పెంటిరాజు, సీపీఎం నాయకులు సుబ్బారావు, మాటూరి చిన్నారావులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినవారిలో ఉన్నారు.
ఇక, ఆంధ్రా వర్సిటీలో ఎత్తివేసిన 20 కోర్సులను తక్షణమే పునరుద్దరించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డి తక్షణమే రీకాల్ చేయాలని కోరారు. ఆంధ్రా యూనివర్సిటీలో రీవాల్యుయేషన్ అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు చలో ఏయూకు పిలుపునివ్వగా.. పోలీసులు ఇందుకు అనుమతి నిరాకరించారు. మరోవైు పరిరక్షణ సమితి మహాధర్నాకు కూడా అనుమతి లేదని పోలీసులు తెలిపారు.