
చిత్తూరు జిల్లా రొంపిచర్లలో టీడీపీ,వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న ఘటనలో పోలీసులు కేసులు నమోదు చేశారు. 15 మంది టీడీపీ, 12 మంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఫ్లెక్సీల విషయంలో వైసీపీ , టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంత పరస్పరం రాళ్లు, బీర్ బాటిళ్లను విసురుకున్నారు. సోడా బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
అంతకుముందు శుక్రవారం చిత్తూరు జిల్లా గుడుపల్లెలో రోడ్డుపై బైఠాయించారు చంద్రబాబు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోవో వచ్చాక కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్ షోలు నిర్వహిస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. నన్ను నా నియోజకవర్గంలో తిరగనివ్వరా.. తాను మీటింగ్ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మీరే చెబుతారా అంటూ ఆయన నిలదీశారు. తాను తల్చుకుంటే నాడు పులివెందులకు జగన్ వెళ్లేవాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాహితం కోసమే తన పోరాటమని.. తాను తిరిగితే ప్రజల్లో మీపై తిరుగుబాటు వస్తుందన్నారు.
మీరు ఎంత ఆపితే ప్రజలు అంతగా తిరగబడతారని ఆయన మండిపడ్డారు. తనను శారీరకంగా ఇబ్బంది పెట్టగలుగుతారని.. ప్రజల కోసం ప్రాణాలైనా ఇచ్చే సంకల్పం తనదేనని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీసుల అరాచకం వెనుక సైకో సీఎం వున్నాడంటూ ఆయన ఆరోపించారు. పోలీసులూ ..మీకు మానవత్వం వుందా అని చంద్రబాబు దుయ్యబట్టారు. తనను తన నియోజకవర్గంలో నడిపించడానికి మీకు సిగ్గనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ఒక రూల్.. మాకో రూలా అంటూ ఆయన దుయ్యబట్టారు. ఏపీలో సైకో రెడ్డి పాలన కొనసాగుతోందని.. తన ప్రచార రథం తనకు అప్పగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Also Read: నన్ను ‘పుడింగి’ అన్నావంటే.. నీకంటే బలవంతుడినని ఒప్పుకున్నట్టే.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి కౌంటర్...
మరోవైపు..చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా పెద్దిరెడ్డిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డిని ఉద్దేశించి ‘పుంగనూరు పుడింగి’ అంటూ వ్యాఖ్యానించడం మీదపెద్దిరెడ్డి స్పందించారు. అసలు చంద్రబాబుకు పుడింగి అంటే అర్థం తెలుసా అని ఎద్దేవా చేశారు. మాట్లాడితే ‘పుంగనూరు పుడింగి’ అంటూ నా గురించి అంటున్నారు.. ఇంతకీ ఆయనకు ఆ మాటకు అర్థం తెలుసా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఆయన కంటే బలవంతులమని ‘పుడింగి’ అనే మాటతో ఒప్పుకున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఒక్క ఓటుతోనే జిల్లాపరిషత్ స్థానాన్ని కైవసం చేసుకున్నామని.. ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పాల సేకరణ ధర విషయంలో చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరీ కంటే తాము కనీస ధర అధికంగానే ఇస్తున్నామని తెలిపారు. హెరిటేజ్ డైరీ పాల సేకరణ ధరలు దమ్ముంటే చంద్రబాబు నాయుడు బయటపెట్టాలని సవాల్ చేశారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. ఇప్పటికే కుప్పంలో స్థానిక సంస్థలన్నింటిని వైసిపి కైవసం చేసుకుందన్నారు.