
విజయవాడ : విచారణ కోసమంటూ స్టేషన్ కు పిలిచిన పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేసాడు. ఓ హెడ్ కానిస్టేబుల్ కారణం లేకుండానే తనను బూటుకాలితో తన్ని అవమానించాడని... అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను బాధితుడు కోరుతున్నాడు. తనను తన్నిన పోలీస్ ను అంత ఈజీగా వదిలిపెట్టబోనని... అవసరమైతే ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇలా సామాన్యుడికి, పోలీస్ కానిస్టేబుల్ కు మధ్య ఉయ్యూరులో వివాదం సాగుతోంది.
బాధితుడి కథనం ప్రకారం... కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన రమేష్ ఓ బార్ లో మద్యం సేవిస్తుండగా పక్కన ఎవరో గొడవ పడ్డారు. అయితే ఈ గొడవతో ఎలాంటి సంబంధం లేకున్నా విచారణ కోసమంటూ పోలీసులు రమేష్ ను పిలిచారు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అతడితో హెడ్ కానిస్టేబుల్ చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. బూటుకాలితో భుజంపై తన్నడంతో హన్మంతరావుకు తీవ్ర గాయమయ్యింది.
హెడ్ కానిస్టేబుల్ తన్నిన చోట తీవ్ర నొప్పి వుండటంతో రమేష్ హాస్పిటల్ వెళ్లాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు భుజం ఎముక విరిగినట్లు తెలిపారు. వెంటనే ఆపరేషన్ చెయ్యాలని సూచించినట్లు బాధితుడు తెలిపారు. దీంతో చేతికి కట్టుతోనే నేరుగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న రమేష్ తనపై దాడిచేసిన హెడ్ కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేసాడు. కానీ పోలీసులు సదరు హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలేదని బాధితుడు చెబుతున్నాడు.
వీడియో
హెడ్ కానిస్టేబుల్ దురుసు ప్రవర్తనతో ఎముకలు విరిగి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసాడు. తన ఈ పరిస్థితికి కారణమైన పోలీస్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు రమేష్ కోరుతున్నాడు. స్థానిక పోలీసులు న్యాయం చెయ్యకుంటే జిల్లా ఎస్పిని కలసి ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు రమేష్ హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి కొందరు పోలీసుల వద్ద మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని బాధితుడు పేర్కోన్నాడు.