తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి‌పై కేసు నమోదు.. కారణమిదే..

By Sumanth KanukulaFirst Published Sep 28, 2022, 11:13 AM IST
Highlights

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. పోలీసుల విధులుకు ఆటంకం కలిగించడం, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అయింది. పోలీసుల విధులుకు ఆటంకం కలిగించడం, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాడిపత్రిలో టీడీపీ నాయకులపై దాడులకు నిరసనగా మంగళవారం టీడీపీ  నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మరికొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఇక, తాడిపత్రిలోని ఇద్దరు టీడీపీ కౌన్సిలర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులను నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ జేపీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో ఆందోళన చేపట్టారు. నల్లబ్యాడీలు ధరించి మౌన ప్రదర్శనకు దిగారు. సీబీ రోడ్డు మీదుగా టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నిరసన ప్రదర్శనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. 

అనంతరం పోలీసులు నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించివేశారు. ఇదిలా ఉంటే.. తన నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. డీఎస్పీ చైతన్య వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కౌన్సిలర్లపై జరుగుతున్న దాడులకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి, డీఎస్పీ చైతన్యలే కారణమని ఆరోపించారు. అయితే అనుమతి లేకుండా ఆందోళన కార్యక్రమం చేపట్టి, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించారని తాడిపత్రి పోలీసులు జేపీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

మరోవైపు తాడిపత్రిలో టీడీపీ కౌన్సిలర్లపై దాడులను ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. 33వ వార్డు కౌన్సిలర్‌ విజయ్‌కుమార్‌ మార్నింగ్‌ వాక్‌ ముగించుకుని ఇంటికి వస్తుండగా పాత మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాడిపత్రిలో గత రెండు రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం రెండోదని.. బాధితులిద్దరూ దళితులేనని టీడీపీ నేతలు తెలిపారు. 
 

click me!