వాలంటీర్ పింఛన్ నిలిపివేశాడని నిరసన.. వితంతువుతో పాటు పలువురిపై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..?

Published : Jul 09, 2023, 12:52 PM ISTUpdated : Jul 09, 2023, 12:53 PM IST
వాలంటీర్ పింఛన్ నిలిపివేశాడని నిరసన.. వితంతువుతో పాటు పలువురిపై కేసు నమోదు.. ఏం జరిగిందంటే..?

సారాంశం

ఓ వితంతువుకు పింఛన్‌ నిలిపివేశారని ఆరోపిస్తూ ఆమెతో పాటు మరికొందరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అయితే ఈ క్రమంలోనే నిరసనకు దిగిన  వితంతువుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఓ వితంతువుకు పింఛన్‌ నిలిపివేశారని ఆరోపిస్తూ ఆమెతో పాటు మరికొందరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అయితే ఈ క్రమంలోనే నిరసనకు దిగిన  వితంతువుతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని తర్లుపాడు మండలం పూతలపాడు గ్రామానికి చెందిన పరిశపోగు నాగులు భర్త చనిపోయాడు. దీంతో ఆమెకు ప్రభుత్వం నుంచి వితంతు పింఛన్ వస్తోంది. ప్రతి నెల గ్రామ వాలంటీర్ ఆమెకు పింఛన్ అందజేస్తున్నారు. 

అయితే జూన్ 1 నుంచి గ్రామ వాలంటీర్ సురేష్ ఆమెకు పింఛన్ పంపిణీనిని నిలిపివేశాడు. దీంతో ఈ విషయంపై సురేష్‌ను నాగులు పలుమార్లు ప్రశ్నించింది. తనకు ప్రభుత్వం పింఛన్ విడుదల చేసినప్పటికీ.. స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే సురేష్ పంపిణీ చేయడం లేదని ఆమె ఆరోపించారు. దీంతో నాగులు ఈ విషయాన్ని సంబంధిత పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో ఎస్‌ నరసింహులు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. 

ఈ క్రమంలోనే నాగులు, గ్రామానికి చెందిన సుమారు 10 మంది.. ఆమెకు పెన్షన్ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మండల పరిషత్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అధికారులు స్పందించకపోవడంతో.. మధ్యాహ్నాం కార్యాలయంలోని సిబ్బంది రాకపోకలు సాగించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి అధికారుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారితో మాట్లాడి నిరసన విరమించాలని సూచించారు. చివరకు, సాయంత్రం ఎంపీడీవో వారి నుంచి అర్జీ తీసుకొని న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు. 

అయితే ఈ ఘటనకు సంబంధించి.. నాగులు, మరికొందరు తమ విధులకు ఆటంకం కలిగించారని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తర్లుపాడు పోలీసులు నాగులుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఇదిలాఉంటే, ఈ ఘటనపై అధికార వర్గాలు స్పందించాయి. నాలుగు భర్త తొమ్మిదేళ్ల క్రితం మరణించాడని.. ఆమె మరొకరిని వివాహం చేసుకున్నట్టుగా ఫిర్యాదు వచ్చిందని పేర్కొన్నారు. అందుకే ఆమెకు పింఛను నిలిపివేసినట్లు వారు తెలిపారు. అయితే, వెరిఫికేషన్‌ అనంతరం ఆమెకు పెన్షన్‌ అందజేత విషయంలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్