మరోసారి వివాదంలో చిక్కుకున్న చింతమనేని, కేసు

By ramya neerukondaFirst Published Nov 16, 2018, 2:12 PM IST
Highlights

పోలవరం మట్టి రవాణాను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే‌, ఆయన అనుచరులు దాడి చేశారని వెంకటకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పెదవేగి పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదైంది. పోలవరం మట్టి రవాణాను అడ్డుకున్నందుకు ఎమ్మెల్యే‌, ఆయన అనుచరులు దాడి చేశారని వెంకటకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే చింతమనేనితో సహా ఆయన గన్‌మెన్‌ గద్దె కిశోర్‌పై కేసు నమోదైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... లక్ష్మీపురం పోలవరం కాలువ వద్ద గట్టు మట్టిని కొందరు తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన వెంకట కృష్ణ అనే యువకుడు ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు అక్కడికి వచ్చేలోపే.. ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులు అక్కడికి చేరుకున్నారు.

అయితే.. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ ఎమ్మెల్యే అనుచరులు, గన్ మెన్ అతనిపై దాడిచేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్సీ ఈశ్వరరావు చెప్పారు. గన్‌మెన్‌ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలితే శాఖాపరమైన చర్యలతోపాటు చట్టప్రకారం కూడా చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. కాగా, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ వైసీపీ దెందులూరు కన్వీనర్‌ కొఠారి అబ్బయ్య చౌదరి నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు పెదవేగి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, రాస్తారోకో చేపట్టారు.

click me!