ఏకంగా 109 బైక్స్ ఛోరీ... ఏపీ పోలీసులకు చిక్కిన ఇద్దరు ఘరానా దొంగలు (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 4, 2021, 3:18 PM IST
Highlights

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 109 ద్విచక్ర వాహనాలను దొంగిలించిన ఇద్దరు  కరుడుగట్టిన దొంగలను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. 

అమరావతి: ద్విచక్ర వాహనాలే వారి టార్గెట్. బైక్ పై వారి కన్ను పడిందో ఇక అది మాయమే. ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా 109 ద్విచక్ర వాహనాలను దొగిలించిన ఇద్దరు కరుడుగట్టిన దొంగలను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దొంగల నుండి స్వాధీనం చేసుకున్న వాహనాలతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ద్విచక్రవాహనాల షోరూంని తలపించింది. మొత్తం బైక్స్ విలువ దాదాపు రూ.55లక్షలు వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాలతో కొవ్వూరు డీఎస్పీ శ్రీనాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దేవరపల్లి, కొవ్వూరు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ ద్విచక్ర వాహనాల దొంగతనంపై దర్యాప్తుకు ప్రత్యేకంగా టీం లను ఏర్పాటు చేసి దర్యాప్తును కొనసాగించారు. 

వీడియో

ఈ క్రమంలో నిన్న(మంగళవారం) స్థానిక ఎస్సై సమక్షంలో పోలీస్ సిబ్బంది  దేవరపల్లిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అటువైపు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోడానికి ప్రయత్నించారు. దీంతో వారిని వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. వీరిద్దరిని విచారించగా సంచలన విషయాలు బయటపెట్టారు. 

ఇద్దరూ ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తామని... ఇప్పటివరకు 109 మోటార్ సైకిళ్ళలను దొంగిలించినట్లు పోలీసులకు తెలిపారు. ఇలా దొంగిలించిన వాహనాలను దాచిన ప్రదేశానికి పోలీసులను తీసుకెళ్లారు. దీంతో ఆ వాహనాలన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలను ఏపీలోని వివిద జిల్లాలతో పాటు తెలంగాణలోని బార్డర్ జిల్లాలో దొంగిలించినట్లు తెలిశారు. 

పోలీసులు స్వాదీనం చేసుకున్న వాహనాలు వివరాలు: 

 హోండా ఫేషన్ ‌- 18
హోండా గ్లామర్  - 12
హీరో స్ప్లెండర్ – 23
హోండా షైన్ ‌- 07
హీరో హెచ్‌ఎఫ్ డెలాక్స్ - 29
బజాజ్ పల్సర్  - 01 
హోండా యునికాన్ - 01
ఎఫ్‌జెడ్ - 01
టి‌వి‌ఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ -17  
 
 

click me!