అంగన్వాడీల 'ఛలో విజయవాడ' ఉద్రిక్తం ... అర్థరాత్రి నిరాహారదీక్షా శిబిరంపై పోలీసుల ఉక్కుపాదం

By Arun Kumar PFirst Published Jan 22, 2024, 8:15 AM IST
Highlights

అంగన్వాడీ వర్కర్లు, సహాయకుల ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఛలో విజయవాడకు అంగన్వాడీల పిలుపు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. 

విజయవాడ : వేతనాల పెంపుతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధనకు ఆంధ్ర ప్రదేశ్ లోని అంగన్వాడీలు ఆందోళన బాట పట్టారు. గత 42 రోజులుగా విధులను బహిష్కరించి సమ్మె చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు నేడు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు అంగన్వాడీలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలా గత అర్థరాత్రి విజయవాడ ధర్నా చౌక్ లో అంగన్వాడీలు చేపట్టిన నిరాహాక దీక్షను పోలీసులు భగ్నం చేసారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

అర్థరాత్రి ధర్నా చౌక్ లోని నిరాహార దీక్షా శిబిరానికి భారీగా చేరుకున్న పోలీసులు టెంట్లు పీకేసి అంగన్వాడీలను చెదరగొట్టారు. కొందరు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని అరెస్ట్ చేసారు. ఇలా అరెస్ట్ చేసినవారిని బస్సుల్లో అక్కడినుండి తరలించారు. కొందరు అంగన్వాడీలను కాళ్లుచేతులు పట్టి ఈడ్చెకెళ్లారు మహిళా పోలీసులు. పోలీసుల తీరుపై అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Latest Videos

ఇక అంగన్వాడీల ఛలో విజయవాడ నేపథ్యంలో బస్టాండ్స్, రైల్వే స్టేషన్లలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటుచేసారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి విజయవాడకు చేరుకోకుండా అంగన్వాడీలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అలాగే ఇప్పటికే విజయవాడకు చేరుకున్న అంగన్వాడీలు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంవద్దకు చేరుకోకుండా అడ్డుకుంటున్నారు. 

Also Read  షర్మిల కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు : భయపడుతున్నారా.. సార్.. అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అంగన్వాడీల ఛలో విజయవాడ నిరసన కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీస్ కమీషనర్ తెలిపారు. కాబట్టి అంగన్వాడీలు ఎవరూ విజయవాడకు రావద్దని సూచించారు.  'జగనన్నకు చెబుదాం' పేరిట కోటి సంతకాలతో కూడిన ప్రతులను ముఖ్యమంత్రికి ఇస్తామని అంగన్వాడీలు ప్రకటించారు. దీంతో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భద్రతను పెంచారు. 

ఇక ఇప్పటికే అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని అమలుచేసింది ప్రభుత్వం. సమ్మెను విరమించి విధుల్లో చేరనివారిని ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరిస్తోంది. అయినప్పటికీ అంగన్వాడీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీంతో విధులకు హాజరుకాని అంగన్వాడీ వర్కర్లు, సహాయకులను తొలగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. 

click me!