జగన్‌పై షర్మిల మాటలన్నీ చంద్రబాబువే .. ఆ యాస, భాష సరికాదు : సజ్జల రామకృష్ణారెడ్డి

By Siva KodatiFirst Published Jan 21, 2024, 5:44 PM IST
Highlights

వైసీపీ, వైఎస్ జగన్‌లపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. షర్మిల వాడిన బాష సరికాదని, చంద్రబాబు రోజూ చేసే ఆరోపణలే ఇప్పుడే షర్మిల చేశారని సజ్జల మండిపడ్డారు. 
 

వైసీపీ, వైఎస్ జగన్‌లపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరికి ప్రయోజనాలను కలిగించేందుకు షర్మిల ఏపీకి వచ్చారని ప్రశ్నించారు. వైఎస్ అభిమానుల ఓట్లు చీలితే చంద్రబాబుకు కొద్దిగా కలిసొస్తుందని అనుకుంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిలకు ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. షర్మిల వాడిన బాష సరికాదని, చంద్రబాబు రోజూ చేసే ఆరోపణలే ఇప్పుడే షర్మిల చేశారని సజ్జల మండిపడ్డారు. 

చంద్రబాబు , కాంగ్రెస్ కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఉనికి లేదని, ఏపీకి అన్యాయం చేసిన పార్టీ ఏదైనా వుందంటే అది కాంగ్రెస్సేనని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల వ్యాఖ్యలు మా అందరికీ బాధ కలిగించాయని, చంద్రబాబును ఎలా సీఎం చేయాలన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. రాష్ట్రానికి, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసిందని సజ్జల తెలిపారు. షర్మిలను చూస్తే జాలి కలుగుతోందని, ఏపీలో నోటాకు వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లే తక్కువని రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. 

రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై ఎందుకు చట్టం చేయలేదని సజ్జల ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో చేరాక షర్మిల యాస, భాష మారాయన్నారు. చనిపోయిన వైఎస్ఆర్ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఇక్కడికి ఎందుకు వచ్చారని సజ్జల ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను తిట్టి.. ఇక్కడికెందుకు షిప్ట్ అయ్యారని ఆయన నిలదీశారు. చంద్రబాబు చివరి అస్త్రం షర్మిలనే అని సజ్జల ఆరోపించారు.

షర్మిల నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారని ఆయన నిలదీశారు. ఏపీలో ఎవరికి ఆయుధంగా ఉపయోగపడేందుకు షర్మిల వచ్చారో అందరికీ తెలుసునని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు కుట్రలో షర్మిల ఓ అస్త్రంగా మారినట్లు కనిపిస్తోందన్నారు.  వైఎస్ కూతురిగా, జగన్ సోదరిగా షర్మిలను గౌరవిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. జగన్‌కు వచ్చే ఓటు చీల్చాలనేదే చంద్రబాబు టార్గెట్ అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు మేలు చేయాలనేదే షర్మిల అజెండా అని సజ్జల వ్యాఖ్యానించారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడేనని, ఆయన డైలాగులనే షర్మిల చెబుతున్నారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. 

click me!