నెల్లూరు కోర్టులో చోరీ కేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్.. 4 రోజులుగా రెక్కీ..!

Published : Apr 16, 2022, 09:56 AM IST
నెల్లూరు కోర్టులో చోరీ  కేసులో పురోగతి.. ఇద్దరు అరెస్ట్.. 4 రోజులుగా రెక్కీ..!

సారాంశం

నెల్లూరు కోర్టులో కీలక పత్రాల చోరీ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకన్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం  చేశారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన నిందితుల  కోసం గాలింపు చేపట్టారు. 

నెల్లూరు కోర్టులో కీలక పత్రాల చోరీ కేసు తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకన్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం  చేశారు. ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగిలిన నిందితుల  కోసం గాలింపు చేపట్టారు. కోర్టులో పత్రాలు చోరీ చేయడానికి ముందు.. దొంగలు 4 రోజులుగా రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా పథకం ప్రకారమే చోరీ జరిగినట్టుగా పోలీసులు నిర్దారణకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, చోరీ జరిగిన ప్రాంతాన్ని  సాంకేతిక అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఇప్పటివరకు లభించిన ప్రాథమిక ఆధారాలను బేస్ చేసుకుని విచారణ కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. కోర్టుకు సమీపంలోని శ్రీ ఉమమహేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కనిపించకుండా పోయినా.. లాప్ టాప్, సెల్ ఫోన్ల గాలింపు కోసం పోలీసులు ప్ర‌త్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. 

ఇక, నెల్లూరులోని నాల్గొవ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తాళాలను పగులగొట్టిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ ప్రజాప్రతినిధికి చెందిన కేసుకు సంబంధించి పత్రాలను, ఇతర పరికారాలను దొంగిలించారని కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఐపీసీ 380, 457 సెక్షన్ల కింద చిన్నబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని, దర్యాప్తు పురోగతిలో ఉందని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. దొంగిలించబడిన పత్రాలు, వస్తువులను రికవరీ చేస్తామని తెలిపారు. 

కాగా.. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి (kakani govardhan reddy)పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (somireddy chandramohan reddy) వేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు చోరీకి గురయ్యాయని  ప్రచారం సాగుతుంది. ఈ కేసుతో పాటు ఇతర కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా చోరీకి గురి కావడం కలకలం రేపుతుంది. మలేషియా, సింగపూర్, హాంగ్ కాంగ్ లలో సోమిరెడ్డికి ఆస్తులు ఉన్నాయని, పెద్దమొత్తంలో లావాదేవీలు జరిపారని కాకాని గతంలో ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలనూ ఇటీవల విడుదల చేశారు. ఆ పత్రాలను మీడియా ముందు కూడా ఉంచారు. అయితే ఆ పత్రాలన్నీ నకిలీవని, తనపై లేనిపోని అభాండాలు వేస్తున్నారని, ఈ నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల చేసిన పత్రాలు ఫోర్జరీవిగా పోలీసులు గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి  తెచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీవి అని ఫోరెన్సిక్ లేబోరేటరీ తేల్చింది. అసలు సోమిరెడ్డి మలేషియాకు వెళ్లలేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో కొందరిని అరెస్టు కూడా చేశారు. ఈ మేరకు పలువురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్