ప్రముఖుల పేర్లు చెప్పి ఎన్ఆర్ఐకి కుచ్చుటోపీ..!

By telugu news teamFirst Published Nov 14, 2020, 12:06 PM IST
Highlights

మైదుకూరు మండలం శెట్టివారిపల్లెకు చెందిన అమెరికా ఎన్ఆర్ఐ రాజేశ్ కుమార్ తో పరిచయం పెంచుకున్నారు. ఈ ఏడాది జైలులో కేంద్రం తరపున లైవ్లీహుడ్ మిషన్ కింద సామాజిక సేవా ప్రాజెక్టు మంజూరైనట్లు చెప్పి నమ్మించాడు.

చీటింగ్ కేసులో పీపుల్స్ ఎగెనెస్ట్ కరప్షన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు మారంరెడ్డి శ్రీకాంత్ రెడ్డిని  కడప జిల్లా  పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నుంచి రూ.20లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

గోపవరం మండలం బెడుసుపల్లెకు చెందిన శ్రీకాంత్ రెడ్డి పీపుల్స్ ఎగెనెస్ట్ కరప్షన్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. యూట్యూబ్ ఛానెల్, ఫేస్ బుక్ లలో లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, మాజీ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ విజయబాబు తదితర ప్రముఖులను ఆహ్వానించేవారు.

ఇదే క్రమంలో మైదుకూరు మండలం శెట్టివారిపల్లెకు చెందిన అమెరికా ఎన్ఆర్ఐ రాజేశ్ కుమార్ తో పరిచయం పెంచుకున్నారు. ఈ ఏడాది జైలులో కేంద్రం తరపున లైవ్లీహుడ్ మిషన్ కింద సామాజిక సేవా ప్రాజెక్టు మంజూరైనట్లు చెప్పి నమ్మించాడు. దీని గురించి ఏపీ సీఎం పేషీలోని సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిలతో చర్చిస్తున్నారంటూ రాజేశ్ ని నమ్మించాడు.

ఈ ప్రాజెక్టుకు సంవత్సరానికి రూ.50కోట్లు నిర్వహణ ఖర్చుల కింద 12శాతం నిధులు ఇస్తున్నారని.. ఖర్చులన్నీ పోగా మూడు కోట్లు మిగులుతుందని ఆయనకు ఆశకల్పించారు. దీనిని నమ్మిన రాజేశ్ రూ.25లక్షలు శ్రీకాంత్ రెడ్డి బ్యాంకు ఎకౌంట్ కి పంపించాడు. రెండో దఫా అతని మామ కడప ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సీనియర్ మేనేజర్ వెంకటశివారెడ్డి ద్వారా రూ.10లక్షలు అందజేశారు. ఈ డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి బంగారు ఆభరణాలు, కారు కొన్నారు.

ప్రాజెక్టు విషయం గురించి శ్రీకాంత్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడేందుకు రాజేశ్ ప్రయత్నించగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానన్న విషయం ఆలస్యంగా గుర్తించిన రాజేశ్ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు ఇటీవల పోలీసులు శ్రీకాంత్ ని అరెస్టు చేశారు.

click me!