అద్దెకు కార్లను తీసుకుని.. వాటిని అమ్మేసి జల్సాలు, ఎన్ని కార్లో తెలుసా?

By telugu news teamFirst Published Jun 12, 2021, 8:03 AM IST
Highlights

అనుమానం వచ్చిన రాజేష్ ఆరా తీయగా తన కారును తనఖా పెట్టినట్లు తేలింది. చేసేదిలేక గత నెల 29న పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో కారు పోయినట్లు ఫిర్యాదు చేశాడు. 

అద్దెకు కారు కావాలని రావడం.. ఆ తర్వాత వాటిని వేరే వారికి అమ్మేసి జల్సాలు చేయడం ఇదే ఓ ముఠా చేస్తున్న పని. గత కొంతకాలంగా ఇలా కార్లు అమ్ముకుంటూ ఎంజాయ్ చేస్తున్న ఓ ముఠాను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం తురాయివలసకు చెందిన పిన్నింటి రాజేష్ తన కారును పార్వతీపురంలోని వైకేఎం కాలనీవాసి మర్రాపు చంద్రమౌళికి నెలకు రూ.29వేలు అద్దె ప్రాతిపదికన అందజేశాడు. కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో కారును అప్పగించాలని చంద్రమౌళిని కోరాడు.

అయితే చంద్రమౌళలి కారును తిరిగివ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన రాజేష్ ఆరా తీయగా తన కారును తనఖా పెట్టినట్లు తేలింది. చేసేదిలేక గత నెల 29న పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో కారు పోయినట్లు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చంద్రమౌళిని అదుపులో తీసుకొని విచారించారు.

వివిధ కోణాల్లో ప్రశ్నించగా తప్పును అంగీకరించాడు. వేర్వేరు వ్యక్తుల నుంచి 29కార్లు తీసుకొని తన అవసరాల కోసం ఏకంగా రూ.2కోట్లకు తనఖా పెట్టినట్లు వివరించాడు. 

బొబ్బిలికి చెందిన సీమంతుల రవి, సీతంపేటకు చెందిన లోలుగు శివరామకృష్ణ సహకారంతో బత్తిలి, పాతపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో కార్లను అద్దె పేరుతో తీసుకొని తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నట్లు తెలిపాడు. పార్వతీపురం పీఎస్ పరిధిలో 9 కార్లు, బొబ్బిలి పీఎస్‌ పరిధిలో 4, బలిజీపేట పీఎస్‌ పరిధిలో 10, విజయనగరంలో 6 కార్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో నిందితులైన చంద్రమౌళి, శివరామకృష్ణలను అరెస్టు చేయగా మూడో నిందితుడు సీమంతుల రవి పరారీలో ఉన్నాడు.

click me!