వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో పోలీసులకు, టీడీపీ నాయకుల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే తనను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రావడంతో.. ప్రవీణ్ కుమార్ రెడ్డి తన ఇంటి నుంచి పోలీసు స్టేషన్‌కు పాదయాత్రగా బయలుదేరారు. వివరాలు.. అక్టోబర్ 28వ తేదీన ప్రొద్దుటూరులో గాంధీ రోడ్డులోని మెడినోవా సర్కిల్ వద్ద వైసీపీ కార్యకర్త బెన్జీపై భరత్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భరత్.. ప్రవీణ్ కుమార్ రెడ్డికి అనుచరుడు కావడంతో పోలీసులు ఈ ఘటనలో ఆయన ప్రమేయంపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ రెడ్డికి కూడా ఈ దాడి ఘటనలో ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తన ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అరెస్ట్ చేశారు. ఈ సమయంలో పోలీసులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ చిన్నపాటి ఉద్రిక్తత చోటుచసుకుంది. పోలీసులు తనను అరెస్ట్ చేయడంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి పోలీసు స్టేషన్‌కు పాదయాత్రకు బయలుదేరి వెళ్లారు. పోలీసులు వాహనం ఎక్కాలని ఒత్తిడి చేసినప్పటికీ ఆయన వినిపించుకోలేదు.
ఈ ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేకపోయినా తనను అరెస్ట్ చేయడంపై ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని.. వైసీపీ నేతలు కావాలనే తనను ఇరికించేలా పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇక, బెనర్జీపై దాడి ఘటనలో ప్రవీణ్ కుమార్ రెడ్డికి సంబంధం లేకపోయినా అక్రమంగా కేసు నమోదు చేశారంటూ టీడీపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.