ఒక్కసారిగా తమపై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారని మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు చెప్పారు. ఈ దాడిలో గాయపడిన పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమలాపురం: ఒక్కసారిగా మాపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేయడంతో తట్టుకోలేక మంత్రి Viswarup ఇంట్లో దాక్కున్నామని మంత్రి ఇంటి వద్ద బందోబస్తు నిర్వహించిన కానిస్టేబుల్ చెప్పారు.
Konaseema జిల్లా పేరునే కొనసాగించాలనే డిమాండ్ తో కోనసీమ జిల్లా సాధన సమితి ఈ నెల 24న కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ముట్టడి విధ్వంసానికి దారి తీసింది. మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిసున్న Police సిబ్బంది తొలుత వచ్చిన 50 మంది ఆఆందోళనకారులను అడ్డుకున్నారు.
ఆందోళనకారులకు పోలీసులు తుపాకులు చూపేసరికి వారు వెనక్కి తగ్గారు. అయితే కొద్దిసేపటికే పెద్ద వెయ్యికి పైగా ఆందోళనకారులు వస్తూనే తమపై రాళ్లతో దాడికి దిగారని చెప్పారు. ఈ రాళ్ల దాడిని తట్టుకోలేక తాము మంత్రి ఇంట్లోకి వెళ్లి దాక్కున్నామన్నారు. అయితే ఆందోళనకారులు వెళ్లిపోతారని భావించి తాము మంత్రి ఇంట్లో పై ఫోర్ కి వెళ్లి దాక్కున్నట్టుగా చెప్పారు.
also read:అమలాపురం అల్లర్ల వెనక చంద్రబాబు, పవన్ హస్తం... ఆదారాలివే..: మంత్రి దాడిశెట్టి రాజా
అయితే నిరసనకారులు మంత్రి ఇంటికి నిప్పు పెట్టారని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ఈ ఘటనలో గాయపడిన సెక్యూరిటీ సిబ్బంది అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం వల్ల వచ్చిన పొగతో కొందరు security సిబ్బందికి శ్వాస సంబంధమైన ఇబ్బందులు వచ్చాయని వైద్యులు చెప్పారు.
నిన్నటి నుండి ఎనిమిది మంది పోలీసులు గాయాలతో చికిత్స కోసం వచ్చినట్టు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ చెప్పారు. ఇందులో ఏడుగురు పోలీసులని ఆయన చెప్పారు. మంత్రి విశ్వరూప్ ఇంట్లో పనిచేసే కుక్, బస్ డ్రైవర్ లకు కూడా చికిత్స చేశామని వైద్యులు చెప్పారు. ఆసుపత్రికి వచ్చిన వారిలో ఎక్కువగా రాళ్ల దాడితో గాయపడిన వారే ఉన్నారని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్ చెప్పారు.
మంత్రి విశ్వరూప్ ఇల్లు పూర్తిగా దగ్దమైంది. ఇంట్లో ఏ వస్తువు కూడా మిగల్లేదు. మరో వైపు మంత్రి ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల ఆయుధాలు కూడా మంటలకు ఆహుతయ్యాయి.