భీమవరంలో పర్యటనలో కృష్ణభారతికి ప్రధాని మోదీ పాదాభివందనం

By Sumanth KanukulaFirst Published Jul 4, 2022, 2:31 PM IST
Highlights

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. భీమవరం సమీపంలో పెదఅమిరంలో బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సభ అనంతరం  ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని మోదీ కలిశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆంద్రప్రదేశ్‌లో పర్యటించారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా.. భీమవరం సమీపంలో పెదఅమిరంలో బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని వేదికపై నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ఆవిష్కరించారు. అల్లూరి కుటుంబ సభ్యులను సత్కరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు.  దేశ స్వాతంత్ర్య పోరాట చ‌రిత్ర కొన్ని సంవ‌త్స‌రాలు లేదా కొంద‌రికి ప‌రిమితం కాద‌ని, అది దేశంలోని న‌లుమూల‌ల నుండి చేసిన త్యాగాల చ‌రిత్ర అని అన్నారు. 

ఇక, బహిరంగ సభ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని కలిశారు. కృష్ణమూర్తి కూతురు కృష్ణ భారతిని (90) కలిసి మోదీ.. ఆమె పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే ఆమె సోదరిని, మేనకోడలిని కూడా మోదీ కలిశారు. 

పసల కృష్ణమూర్తి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలోని పశ్చిమ విప్పర్రు గ్రామంలో 1900లో జన్మించారు. కృష్ణమూర్తి 1921లో తన సతీమణితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధేయవాది అయిన ఆయన కృష్ణమూర్తి ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. కృష్ణమూర్తి 1978లో మరణించారు.

click me!