ప్రధాని మోదీ హెలికాఫ్టర్ వెళ్తున్న మార్గంలో నల్ల బెలూన్ల ఎగరవేత.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ సమీపంలో భద్రతా వైఫల్యం!

By Sumanth KanukulaFirst Published Jul 4, 2022, 1:20 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. మోదీ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమరవం వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని  వ్యక్తులు ఆకాశంలోకి నల్ల బెలూన్లను వదిలారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. మోదీ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి భీమరవం వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని  వ్యక్తులు ఆకాశంలోకి నల్ల బెలూన్లను వదిలారు. ఎయిర్‌పోర్టుకు 2 కి.మీ దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోదీ హెలికాఫ్టర్ మార్గంలో డజన్ల కొద్ది బెల్లూన్లు కనిపించాయి. అయితే ఇవి ప్రధాని మోదీ హెలికాప్టర్‌కు సమీపంలోనే ఎగరడం కొంత కలవరానికి గురిచేశాయి. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆ బెలూన్లు ఎవరు వదిలారో కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని పెదఅమిరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ఆవిష్కరించారు. బహిరంగ సభ వేదికపై అల్లూరి కుటుంబ సభ్యులను మోదీ  సత్కరించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా  అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి అని కొనియాడారు. 

అనంతరం హిందీలో మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. లంబసింగిలో అల్లూరి మెమోరియల్, గిరిజన మ్యూజియం నిర్మిస్తామని తెలిపారు. యావత్ భారతవనికి అల్లూరి స్పూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు. అల్లూరి జయంతి రోజు మనందరం కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పుణ్య భూమి అని.. వీర భూమి అని చెప్పారు. అల్లూరి పుట్టిన ఈ పుణ్య భూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టుగా తెలిపారు. 

click me!