ప్రధాని మోదీ రాజీనామా డిమాండ్... పిడుగురాళ్లలో సామాన్యుడి నిరాహారదీక్ష

By Arun Kumar PFirst Published Jun 2, 2021, 4:16 PM IST
Highlights

 గుంటూరు జిల్లాకు చెందిన ఓ సామాన్యుడు మరో అడుగు ముందుకేసి కరోనాను నియంత్రించడంలో విఫలమైన ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ నిరాహారదీక్షకు దిగాడు.

గుంటూరు: కరోనా మహమ్మారిని నియంత్రించలేక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులెత్తేశారని... అందువల్లే దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే గుంటూరు జిల్లాకు చెందిన ఓ సామాన్యుడు మరో అడుగు ముందుకేసి కరోనాను నియంత్రించడంలో విఫలమైన ప్రధాని మోదీ రాజీనామా చేయాలంటూ నిరాహారదీక్షకు దిగాడు. పది రోజులపాటు ఈ నిరాహార దీక్షను కొనసాగనుంది. 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణానికి చెందిన ముత్యం బాలగంగాధర్ రెడ్డి దేశంలో కరోనా విలయతాండవాన్ని చూసి చలించిపోయాడు. దేశంలో కరోనా మారణహోమానికి ప్రధానే  కారణమని భావించిన అతడు మోదీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాడు. ఇందుకోసం ఇంట్లోనే ఉండి నిరాహారదీక్ష చేస్తున్నాడు. నేటి(బుధవారం) నుండి పదిరోజుల పాటు ఇంటి నుండే తన దీక్షను కొనసాగిస్తానని బాలగంగాధర్ వెల్లడించారు.

ఈ సందర్భంగా బాలగంగాధర్ మాట్లాడుతూ... స్వలాభం కోసం దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ప్రధాని మోదీ ఎన్నికలు జరపడానికి అనుమతి ఇచ్చారని ఆరోపించారు. అలాగే కుంభమేళకు అనుమతులిచ్చి కోట్ల మంది ప్రజలను కరోనా బారిన పడటానికి కారకులయ్యారని అన్నారు. ఇలాంటి ప్రధానమంత్రి దేశాన్ని పాలించడానికి అనర్హుడని బాలగంగాధర్ ద్వజమెత్తాడు.

కళ్ళముందే కనుపడుతున్న శవాలను చూస్తూ చలించలేని ప్రధాని మనదేశానికి అవసరం లేదని గంగాధర్ అభిప్రాయ పడ్డాడు. మోడీ గద్దెనెక్కి ఏడేళ్ళవుతున్నా బడుగు బలహీన వర్గాలకు చేసిందేమి లేదని... స్వచ్ఛ భారత్ పేరిట రోడ్లు ఊడవటం తప్పా అని ఎద్దేవా చేశాడు. కరోనాని కట్టడి చేసేందుకు ఆయన చేపట్టిన చర్యలు శూన్యం కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేసి ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నానని అన్నారు. అవసరమైతే దీక్షను మరింత బలంగా చేస్తానని బాలగంగాధర్ రెడ్డి తెలియజేశారు.
 

click me!