సోమశిల ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీ... మంత్రి మేకపాటి కీలక నిర్ణయం (వీడియో)

By Arun Kumar PFirst Published Jun 2, 2021, 3:48 PM IST
Highlights

సోమశిల ప్రాజెక్ట్ పనుల పర్యవేక్షణ కోసం ఏర్పాటుచేసిన తిసభ్య కమిటీ సభ్యులతో ఇవాళ(బుధవారం)  తొలి సమావేశం నిర్వహించారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. 

నెల్లూరు: సోమశిల ప్రాజెక్టు పనులను మరింత వేగంగా పూర్తిచేసే దిశగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పనుల పర్యవేక్షణ కోసం "త్రిసభ్య కమిటీ"ని ఏర్పాటు చేసినట్లు మంత్రి  గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఫేజ్-1, 2లలో భూసేకరణ సమస్య సహా ప్రాజెక్టు చుట్టూ ముడిపడి ఉన్న ఇబ్బందులన్నీ తొలగించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోనుంది ఈ ముగ్గురు సభ్యుల కమిటీ.   

నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.నాగేంద్ర, నెల్లూరు జిల్లా జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణా రావు సభ్యులుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటయ్యింది. త్రిసభ్య కమిటీని ఏర్పాటుకు సంబంధించి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర బాబు.

ఇవాళ(బుధవారం) కమిటీ సభ్యులతో తొలి సమావేశం నిర్వహించారు మంత్రి మేకపాటి. సోమశిల, కండలేరు భూసేకరణ, ఆర్అండ్ఆర్ అమలు, ఫేజ్-2 పనులు, దక్షిణ కాలువ విస్తరణ, అటవీశాఖ నిబంధనల అమలు వంటి పనులను ఎలా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలో మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రతి వారం ఈ త్రిసభ్య కమిటీ సమావేశమై ఎప్పటికప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించాలని ఆదేశించారు. 

వీడియో

సమయాన్ని నిర్దేశించుకుని ఎప్పటికప్పుడు తనకు పురోగతి చూపించాలని జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ని మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశించారు. దీంతో కేవలం రెండు రోజుల సమయం ఇస్తే సోమశిల ప్రాజెక్టు పూర్తికి చేపట్టవలసిన చర్యలతో కూడిన ప్రణాళిక, కార్యాచరణను సిద్ధం చేస్తామని మంత్రి మేకపాటికి తెలిపారున జాయింట్ కలెక్టర్.  

ప్రజల ఆశలను నెరవేర్చే బాధ్యత మీదేనని మంత్రి అధికారులతో వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు పూర్తికి అవసరమైన చర్యలను తీసుకోవడంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. నెలల కాలంలోనే ప్రాజెక్టును పూర్తిచేసి చూపించాలన్నారు. 

మంత్రి మేకపాటితో జరిగిన సమావేశానికి జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, నెల్లూరు జిల్లా జలవనరుల శాఖ కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణా రావు, జిల్లా అటవీ శాఖ అధికారులతో పాటు మరికొందరు అధికారులు పాల్గొన్నారు. 


 

click me!