
రాష్ట్రంలో మౌళిక సదుపాయాల కల్పనలో తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ చెప్పిందంతా అబద్దాలేనా? మూడేళ్ళల్లో 22 లక్షల మరుగుదొడ్లను నిర్మిచేసామని, గ్రామాల్లో, పట్టణాల్లో మంచినీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అక్షరాస్యతా శాతం పెంచటం తదితరాలపై చంద్రబాబునాయుడు, లోకేష్ పదే పదే చేస్తున్న ప్రకటనలన్నీ పూర్తిగా వాస్తవాలు కావని సాక్ష్యాత్తు ప్రణాళికా శాఖ వెల్లడించింది. అక్షరాస్యతా శాతం, ప్రభుత్వ స్కూళ్ళల్లో మంచినీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మల విసర్జన, రోడ్ల నిర్మాణం..ఇలా ఏది తీసుకున్నా చెబుతున్న మాటలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదన్న విషయం బయటపడింది.
ఈమధ్యనే చంద్రబాబు రెండు రోజులు జిల్లాల కలెక్టర్ల సమావేశాలు నిర్వహించారు. అందులో తమ జిల్లాల్లోని వాస్తవ పరిస్ధితులను కలెక్టర్లు గణాంకాలతో సహా అందించారు. వాటిని ప్రణాళికా శాఖ ‘‘విజన్-2020’’ పేరుతో ఓ నివేదికగా ముద్రించింది. అందులోని అంశాలను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది ప్రజలకు మంచినీటి సరఫరా కూడా కావటం లేదని తేలింది. 10 వేలకు పైగా జనావాసాలకు రోడ్డు సౌకర్యం కూడా లేదట. 67 శాతం గ్రామాల్లో సరైన మరుగుదొడ్డి సౌకర్యాలు కూడా లేకపోవటం నిజంగా బాదాకరమే. 3 వేలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు తాగేందుకు మంచినీరు కూడా లేదట.
అంటే, ఇంతకాలం ప్రభుత్వం చెబుతున్నదానికి, వాస్తవ పరిస్ధితులకు ఏమాత్రం పొంతన లేదన్న విషయం ప్రభుత్వ డాక్యుమెంట్ ద్వారానే బయటపడింది. ఇప్పటి వరకూ 22 లక్షల మరుగుదొడ్లు కట్టించామని ప్రభుత్వం చెబుతున్నమాటల్లో నిజమెంతో అర్ధం కావటం లేదు. సిఎం సొంత జిల్లా చిత్తూరులోనే సుమారు 4 వేల ఆవాసాలుకు రోడ్డు సౌకర్యం లేదంటే పరిస్ధితి ఎలాగుందో అర్ధమవుతోంది. రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి మినహా మిగిలిన అన్నీ జిల్లాల్లోనూ 90 శాతం పంచాయితీల్లో బహిరంగ మలవిసర్జనే జరుగుతోందట. రాష్ట్రంలో అక్షరాస్యతా శాతం ఇప్పటికీ 67 శాతమే. అంటే ఐదు కోట్ల రాష్ట్ర జనాభాలో 1.35 కోట్ల మంది నిరక్షరాస్యులే. తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నిరక్షరాస్యత ఎక్కువట.