
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నేడు పింగళి వెంకయ్య 146వ జయంతిని పురస్కరించుకుని సీఎం జగన్ నివాళులర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద సీఎం జగన్.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. పింగళి వెంకయ్య విగ్రహం వద్ద సీఎం జగన్ నివాళులర్పించారు.
‘‘దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఇక, పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్టుగా ఏపీ సర్కార్ తెలిపింది. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా.. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. పింగళి వెంకయ్యపై రూపొందించిన ప్రత్యేక కవర్‌ను పోస్టల్ శాఖ ఆవిష్కరించనున్నారు.
ఇదిలా ఉంటే.. పింగళి వెంకయ్య జయంతి ఉత్సవాలను ఆగస్టు 2వ తేదీన ఢిల్లీ వేదికగా నిర్వహిస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. జాతికి పింగళి వెంయ్య జాతికి చేసిన సేవలను స్మరించుకునేలా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ "తిరంగ ఉత్సవ్"ను ఈరోజు సాయంత్రం ఢిల్లీలో నిర్వహించనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తిరంగ ఉత్సవ్‌లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో పింగళి వెంకయ్య దేశానికి ఎనలేని సేవలందించినందుకు స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయనున్నారు. అలాగే పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులను అమిత్ షా సత్కరిస్తారు. ఈ కార్యక్రంలో తిరంగ ఉత్సవ్ ‘‘హర్ ఘర్ తిరంగ’’ గీతం, వీడియోను లాంచ్ చేయనున్నారు. అలాగే సాంస్కృతిక, సంగీత ప్రదర్శనలు ఉండనున్నాయి.
స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ జాతీయ జెండా రూపకర్త అయిన పింగళి వెంకయ్య గాంధీ సిద్ధాంతాలను అనుసరించేవారు. మహాత్మా గాంధీ అభ్యర్థన మేరకు.. కుంకుమ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చక్రంతో భారత జాతీయ జెండాను రూపొందించాడు.