పిడుగురాళ్లలో ఆటోలో అరాచకమంటూ వస్తున్న వార్తలపై డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి క్లారిటీ

By telugu teamFirst Published Aug 29, 2021, 8:15 PM IST
Highlights

పిడుగురాళ్లలో కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఆటోలో అరాచకంపై చర్చలో పాక్షిక నిజాలే ఉన్నాయని డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి క్లారిటీనిచ్చారు. పోలీసుల అసమర్థత అంటూ చేస్తున్న వాదనలను ఖండించారు. ఆ ఎపిసోడ్‌పై క్లారిటీనిచ్చారు.

గుంటూరు: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో ఆటోలో అరాచకమంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఈ వదంతులపై సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి స్పందించి వివరణ ఇచ్చారు. ఈ వార్తల్లో తప్పుడు సమాచారమే ఎక్కువగా ఉన్నదని తెలిపారు. పోలీసుల అసమర్థత అంటూ చేస్తున్న వాదనలను ఆయన ఖండించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఘటననంతా వివరించి చెప్పారు.

మూడు రోజుల క్రితం ఆటోలో జరిగిన గొడవపై స్టేషన్ యస్‌హెచ్‌వో తక్షణమే స్పందించారని డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్‌ను పిలిపించి యస్‌హెచ్‌వో ఆరా తీశారు. డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ మిస్సింగ్ కేసులో కడప పోలీసులు యువతి కోసం గాలిస్తున్నారు. ఏదైనా సమాచారం లభించినా, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించిన తమకు విషయం తెలుపాల్సిందిగా కడప పోలీసులు ఆటో డ్రైవర్ నల్లబోతుల ఆవులయ్యకు తెలిపారు. ఈ క్రమంలోనే తన ఆటో ఎక్కిన సుందరయ్య కాలనీ దంపతులపై అనుమానం కలిగి డ్రైవర్ వారిని ఒకింత ఇబ్బంది పెట్టాడు. ఆటోలో ఎక్కిన మహిళ భర్త మస్తాన్ డ్రైవర్‌పై చేయిచేసుకున్నారు. దంపతులను వారు పనిచేస్తున్న మిల్లు వద్ద దింపగానే డ్రైవర్ కడప పోలీసులకు విషయం చేరవేశాడు. అనంతరం పోలీసులను ఆ మిల్లు దగ్గరకు తీసుకెళ్లారు. కానీ, వారు వెతుకుతున్న యువతి ఆమె కాదని పోలీసులు నిర్ధారించుకుని వెళ్లిపోయారు. ఆటోలో భార్య ముందు హీరోలా కొడతావా? అంటూ డ్రైవర్ మస్తాన్‌పై చేయిచేసుకున్నాడు. ఈ గొడవ పోలీసు స్టేషన్‌కు చేరింది.

జరిగిన తప్పును డ్రైవర్ ఒప్పుకున్నాడు. దీంతో సీఐ ప్రభాకర్ రావు ఇరువురినీ మందలించారు. మరుసటి రోజు పోలీసు స్టేషన్‌కు రావాలని ఇద్దరిని పంపించేశారు. కానీ, ఆ రెండు రోజులు సీఐ ప్రభాకర్ రావు అందుబాటులో లేరు. దీంతో బాధతో వచ్చిన మస్తాన్‌ను పోలీసులు పట్టించుకో పోగా, సీఐ వచ్చాక రావాలని కానిస్టేబుల్ దురుసుగా చెప్పాడని మనస్థాపం చెందాడు. మీడియాను ఆశ్రయించాడు. జరిగిన ఘటనను తారుమారు చేసి వివరించారు. అనంతరం పోలీసులకు సత్వర స్పందన లేదంటూ ప్రచారమైంది. ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు డీఎస్పీ స్పష్టం చేశారు. అత్యుత్సాహం చూపిన ఆటోడ్రైవర్, ఆవేశంతో మాటలు అల్లుకుని భార్యభర్తలు చేసిన చిన్నపాటి అపార్థాలను పోలీసుల అసమర్థతగా చూపడం సరికాదని తెలిపారు. ప్రజా సంఘాలు, కొంతమంది పార్టీ నాయకులు నిజానిజాలను ధ్రువపరుచుకుని మాట్లాడాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

click me!